ఏడాదిలోగా పాలమూలరు – రంగారెడ్డి

– ఆరునెలల్లోగా డిండిపూర్తి చేయాలి

– ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్లోనూ నిధులు కేటాయిస్తాం

– మస్కూరీలను నీటిపారుదలశాఖలో విలీనం చేసి లష్కర్లుగా ఉపయోగించాలి

– అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌,జనవరి 23(జనంసాక్షి):వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు ? రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి వందశాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. ఫ్లోరైడ్‌, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి, ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధుల వరద ఆగవద్దని, ఈ ఏడాది బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తామని సిఎం స్పష్టం చేశారు. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్‌ దాకా రావాల్సిన అవసరం లేకుండా, వివిధ స్థాయిల అధికారులే మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇచ్చే చారిత్రిక నిర్ణయం తీసుకున్నట్లు సిఎం వెల్లడించారు. మస్కూరీలను నీటి పారుదల శాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు, వారికి తగు శిక్షణ ఇచ్చి ప్రాజెక్టుల నిర్వహణలో ఉపయోగించుకోనున్నట్లు సిఎం కేసీఆర్‌ వెల్లడించారు. పాలమూరు ? రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌ లో సవిూక్ష నిర్వహించారు. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సురేందర్‌, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఇఎన్సీ మురళీధర్‌ రావు, సిఇలు మోహన్‌ కుమార్‌, రమేశ్‌, రఘునాథరావు, ఎస్‌ఇలు ఆనంద్‌, విజయభాస్కర్‌ రెడ్డి, ఉమాపతి రావు, సూర్య నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలమూరు ? రంగారెడ్డి ప్రాజెక్టుపై సవిూక్షలో భాగంగా నార్లాపూర్‌ రిజర్వాయర్‌, పంపుహౌజ్‌, నార్లాపూర్‌ ? ఏదుల కాలువ, ఏదుల పంపుహౌజ్‌, ఏదుల-వట్టెం కాలువ, వట్టెం రిజర్వాయర్‌, వట్టెం-కర్వెన కాలువ, కర్వెన రిజర్వాయర్‌, కర్వెన-ఉద్దండాపూర్‌ కాలువ, టన్నెల్‌ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవిూక్షించారు. ఉద్దండాపూర్‌ నుంచి ఎగువ ప్రాంతాలకు నీరందించే మార్గానికి సంబంధించి తుది డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. కల్వకుర్తి, బీమా, కోయిల్‌ సాగర్‌, నెట్టెంపాడు పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు, జూరాలతో కలిపి 11.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సిఎం వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మహబూబ్‌ నగర్‌ జిల్లా సస్యశ్యామలం అవతుందని కేసీఆర్‌ అన్నారు. డిండి ప్రాజెక్టు పరిధిలోని కాలువలు, రిజర్వాయర్ల పనులను సిఎం సవిూక్షించారు. – పాలమూరు ? రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులకు వెంట వెంటనే బిల్లులు చెల్లించడానికి తక్షణం రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు.ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణను పూర్తి చేయడానికి తక్షణం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను సిఎం కోరారు. చట్ట ప్రకారం ఇవ్వల్సిన పరిహారం రైతులకు అందించి, వెంటనే భూ సేకరణను పూర్తి చేసి, భూమిని నీటి పారుదల శాఖకు అప్పగించాలని చెప్పారు. – బిహెచ్‌ఇఎల్‌ అధికారులతో సమావేశమై అవసరమైన మోటార్లను వెంటనే తెప్పించి, బిగించే పనులను పర్యవేక్షించాలని నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ ను సిఎం కోరారు. విద్యుత్‌ శాఖ అధకారులతో ఎప్పటికప్పుడు సమన్వయంతో వ్యవహరించాలి.- ప్రతీ ఏడాది ముందుగా అన్ని చెరువులను నింపాలి. – మిషన్‌ భగీరథకు నీరివ్వాడానికి వీలుగా అన్ని రిజర్వాయర్లలో మినిమమ్‌ డ్యామ్‌ డ్రాయింగ్‌ లెవల్‌ ను మెయింటేన్‌ చేయాలి. ”తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగేది. ఇప్పుడు కోటి పది లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నది. సాగునీటి వసతి పెరగడం వల్లే ఇది సాధ్యమైంది. కోటి 25 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే వ్యవస్థ సిద్ధమవుతున్నది. బోర్ల ద్వారా సాగయ్యే భూమి దీనికి అదనం. సాగునీరు అందించడంతో పాటు మిషన్‌ భగీరథకు కావాల్సిన నీరు, పరిశ్రమలకు నీరు అందించే బాధ్యత కూడా నీటి పారదుల శాఖకే ఉంది. దీంతో నీటి పారుదల శాఖ ప్రాధాన్యం, పరిధి ఎంతో పెరిగింది. సాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి నీటి పారుదల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆయా ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, తూములు, చెక్‌ డ్యాములు, ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు అన్నీ కూడా ఒకే సిఇ పరిధికి తేవడం జరిగింది. డిఇఇ స్థాయి నుంచి ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ స్థాయి వరకు ప్రతీ అధికారికి నిర్ధిష్టమైన ఆర్థిక అధికారాలను ప్రభుత్వం బదిలీ చేసింది. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్‌ దాకా రావాల్సిన అవసరం లేకుండా, స్థానిక అధికారులే మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇవ్వడం జరిగింది. ఇది చారిత్రాత్మక నిర్ణయం. దేశంలో మరెక్కడా ఈ విధానం లేదు. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (జనరల్‌)కు ఒక్కొక్క పనికి 1 కోటి మించకుండా సంవత్సరానికి 25 కోట్ల రూపాయల వరకు, చీఫ్‌ ఇంజనీర్‌(సి.ఈ.)కు ఒక్కొక్క పనికి 50 లక్షలు మించకుండా సంవత్సరానికి 5 కోట్ల వరకు, పర్యవేక్షక ఇంజనీర్‌ (ఎస్‌.ఈ )కు ఒక్కొక్క పనికి 25 లక్షలు మించకుండా సంవత్సరానికి 2 కోట్ల వరకు, కార్యనిర్వాహక ఇంజనీర్‌(ఇ.ఇ.)కు ఒక్కొక్క పనికి 5 లక్షలు మించకుండా సంవత్సరానికి 25 లక్షల వరకు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్‌(డి. ఇ. ఇ.)కు ఒక్కొక్క పనికి 2 లక్షలు మించకుండా సంవత్సరానికి 5 లక్షల వరకు ఆర్థిక అధికారాలను ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుని చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేసుకోవాలి. రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగునీరు అందించాలి” అని సిఎం కేసీఆర్‌ కోరారు. ”నీటిపారుదల శాఖను ప్రభుత్వం ఇటీవల పునర్వ్యవస్థీకరించింది. ఈ విభజన, ఆయా అధికారులకు నిర్ణయించిన పరిధి సౌకర్యవంతంగా, పనులు చేయడానికి అనువుగా ఉందో లేదో అనే విషయంలో ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. అవసరమైన పక్షంలో మార్పులు చేయాలి” అని సిఎం అధికారులను ఆదేశించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్‌ భగీరథ ద్వారా ఆరోగ్య కరమైన, పరిశుద్ధమైన మంచినీళ్లు అందుబాటులోకి వచ్చినందున ప్రజలు వాటిని తాగేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను కోరారు. మిషన్‌ భగీరథ నీళ్లు ప్రస్తుతం బాటిళ్ల ద్వారా కూడా అందుబాటులోకి వచ్చినందున గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఈ నీటినే వినియోగించాలని కోరారు. ప్రజలకు కూడా మిషన్‌ భగీరథ నీటిని తాగాలని పిలుపునిచ్చారు. మిషన్‌ భగీరథ నీళ్లలో అన్ని మినరల్స్‌ తగిన పాళ్ళలో ఉన్నాయని చెప్పారు.