ఏపీ భూసేకరణ చట్టానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ 

– లభించిన న్యాయశాఖ ఆమోదం
ఢిల్లీ, మే12(జ‌నం సాక్షి ): ఏపీ భూసేకరణ చట్ట సవరణకు కేంద్రం దాదాపు అంగీకారం తెలిపింది. మూడు రోజుల క్రితం న్యాయశాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం. అధికారులు, నిపుణులతో సంప్రదించిన తర్వాత కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఈ ఫైలుపై శుక్రవారం హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌గాబా సంతకం చేశారు. హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్‌ గంగారం వద్దకు ఫైలు చేరింది. సోమవారం తర్వాత దస్త్రంపై పీఎంవో తుది నిర్ణయం తీసుకోనుంది. తర్వాత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆమోదానికి ఫైలును పంపే అవకాశం ఉంది. ఈ వారంలో దాదాపు ఆమోదం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ… 2017 నవంబర్‌లో కొత్త బిల్లును ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. బిల్లుపై పలు సందేహాలను కేంద్ర మంత్రిత్వశాఖలు లేవనెత్తాయి. కేంద్రం లేవనెత్తిన సందేహాలను రాష్ట్ర అధికారులు నివృత్తి చేశారు. అన్నీ పక్రియలు పూర్తయ్యాక న్యాయ, ¬ం శాఖ అధికారుల ఆమోదం లభించింది.