ఐఎస్‌లో చేరేవారి ఆస్తులు స్వాధీనం

ఎన్‌ఐఎ ఆదేశాలు

న్యూఢిల్లీ,జూలై5(జ‌నం సాక్షి ): కేరళ నుండి ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థలోని చేరుతున్న యువకుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. మొదటి నిందితుడైన అబ్దుల్‌ రషీద్‌ అబ్దుల్లా నివాసం వద్ద ఎన్‌ఐఎ అధికారులు నోటీసుని పోస్ట్‌ చేశారు. ఈ విషయంలో త్రిక్కీపుర్‌ గ్రామ అధికారికి నోటీసు జారీ చేసింది. ప్రస్తుతం వారు ఎన్‌ఐఎ కోర్టులో ఉన్నారు. క్రిమినల్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం 81,82, 83 కింద చర్యలు తీసుకోనున్నారు. 2016 నుండి కేరళలోని కాసరగోడ్‌ జిల్లాలోని నివసిస్తున్న కుటుంబాల్లోని 14 మంది ఐఎస్‌ఐఎస్‌లో చేరడానికి భారత్‌ను విడిచి వెళ్లిపోయారు. కాగా, గత మార్చిలో వీరందరినీ ప్రధాన నిందితుడైన అబ్దుల్‌ రషీద్‌ అబ్దుల్లా ప్రేరేపిస్తున్నాడని గుర్తించారు. జనవరి 27, 2017 న, నిందితుడు అబ్దుల్లా , జాహిద్‌పై ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ నవంబరు 9, 2017 న మొదలు కాగా, ఇప్పటి వరకు ప్రాసిక్యూషన్‌ 52 సాక్షులను పరిశీలించింది.