‘ఐదుగురిని కన్న మహిళకు అవార్డు’

aksha

 చెన్నై : తమిళనాడులో ఐదుగురు పిల్లలను కన్న తల్లిని అవార్డుతో సత్కరించనున్నట్లు విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఆర్ గోపాల్‌జీ గురువారం ప్రకటించారు. భారతదేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఈ దేశ సోదరీమణులు అధిక సంఖ్యలో పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాజకీయాలు అవసరం లేదని చెప్పారు. ఇతరులు మతం పేరుతో లెక్కకు మించి పిల్లలను కంటున్నపుడు హిందూ స్త్రీలు మాత్రం ఎందుకు అధిక సంఖ్యలో పిల్లలను కనకూడదని ఆయన ప్రశ్నించారు. కనీసం ఐదుగురు పిల్లలను కనే తల్లులకు అవార్డును ప్రదానం చేయాలని వీహెచ్‌పీ పరిశీలనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

గతంలో పది మంది పిల్లలను కన్నతల్లికి వీరమాత అవార్డును ప్రదానం చేసేవారు. అయితే ఆ తరువాత కుటుంబ నియంత్రణ అమల్లోకి రావడంతో పిల్లల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీనివల్ల భవిష్యత్తులో యువశక్తి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతుందనే ఆందోళనతో అధిక సంఖ్యలో పిల్లలను కనాలనే ప్రచారాన్ని కొందరు నేతలు సాగిస్తున్నారు. విశ్వహిందూపరిషత్ సైతం అధిక సంఖ్యలో పిల్లల్ని కనాలనే నినాదాన్ని ప్రచారంలో పెట్టింది.