ఐసిసి క్రికెట్ కమిటీలోకి కుంబ్లే , శివరామకృష్ణన్
దుబాయ్ మే 6 (జనంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్యలో బీసిసిఐ తన ఆధిపత్యం మరోసారి నిరూపించుకుంది. కీలకమైన ఐసిసి క్రికెట్ కమిటీలలో భారత్ నుండి ఇద్దరు మాజీ క్రికెటర్లకు చోటు దక్కించుకుంది. తాజాగా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే , లక్ష్మణ్ శివరామకృష్ణన్ క్రికెట్ కమిటీలోకి ఎంట్రీ ఇచ్చారు. శివరామకృష్ణన్ టిమ్ మే స్థానంలో ఎంపికవగా…అనిల్ కుంబ్లే కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. శివరామకృష్ణన్‌తో పాటు కుమార సంగక్కరా ప్రస్తుత ఆటగాళ్ళకు కమిటీ ప్రాతినిథ్యం వహించనున్నారు. వీరిద్దరూ ఇటీవలే 10 టెస్ట్ దేశాల కెప్టెన్ల ఓటుతో ఎన్నికైనట్టు ఐసిసి తెలిపింది. వీరిద్దరూ 2013-2015 కాలానికి బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా మే 28 , 29 తేదీలలో ఐసిసి క్రికెట్ కమిటీ వార్షిక సమావేశం జరగనుంది. కుంబ్లే సారథ్యంలో ఇదే మొదటి విూటింగ్ కాగా శివరామకృష్ణన్ కూడా తొలిసారి హాజరుకాబోతున్నాడు. అటు గత ఆటగాళ్ళకు ప్రతినిధిగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ ఎంపికయ్యాడు.