ఐసీఐసీఐ ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి

– జులై 1న బాధ్యతలు స్వీకరించనున్న గిరీశ్‌ చంద్ర చతుర్వేది
ముంబయి, జూన్‌29(జనం సాక్షి) : దేశీయ ప్రయివేటు బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఎం.కే శర్మ పదవీకాలం శనివారంతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో మాజీ ఐఏఎస్‌ అధికారి గిరీశ్‌ చంద్ర చతుర్వేదిని పార్ట్‌టైమ్‌ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ శుక్రవారం వెల్లడించింది. జులై 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. చతుర్వేది నియామకానికి వాటాదారులు సమ్మతిస్తే ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ‘నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పార్ట్‌టైమ్‌ ఛైర్మన్‌గా గిరీశ్‌ చంద్ర చతుర్వేది నియామకానికి బోర్డు అంగీకరించిందని ఐసీఐసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 1977 బ్యాంచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన చతుర్వేది 2013 జనవరిలో చమురు మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పదవీ విమరణ చేశారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న శర్మ పదవికాలం జూన్‌ 30తో ముగియనుంది. ఛైర్మన్‌గా
శర్మను మరోసారి కొనసాగించాలని బోర్డు సభ్యులు భావించినప్పటికీ ఆయన అయిష్టత వ్యక్తం చేశారు. దీంతో కొత్త ఛైర్మన్‌ కోసం బ్యాంకు అన్వేషణ మొదలుపెట్టింది. తొలుత ఐసీఐసీఐ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న ఎం.డి. మాల్యా పేరు వినిపించినప్పటికీ చతుర్వేది నియామకానికి బోర్డు మొగ్గుచూపింది. వీడియోకాన్‌ రుణాల వ్యవహారంలో ప్రస్తుతం ఐసీఐసీఐ యాజమాన్యం చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతుండటంతో సీఈవో చందాకొచ్చర్‌ను దీర్ఘకాలిక సెలవులో పంపించారు. సీవోవోగా సందీప్‌ భక్షిని నియమించారు.