ఐసీయూలో అగ్నిప్రమాదం..తప్పిన ముప్పు

ఒంగోలు,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి)
: ప్రకాశం జిల్లా కందుకూరు ఏరియా ఆస్పత్రి ఐసీయూలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఐసీయూలో ముగ్గురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. చిన్నారుల తల్లిదండ్రులు అప్రమత్తమై పిల్లలను బయటకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు సంఘటనపై విచారణ జరుపుతున్నారు. ఇదిలావుంటే పురిటి నొప్పులతో బాధపడుతోన్న మహిళను ఆసుపత్రికి తీసుకొచ్చే సమయంలో 108 వాహనంలోనే కాన్పు చేసి తల్లీబిడ్డను సిబ్బంది క్షేమంగా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కొనకనమిట్ల మండలం నాయుడుపేటకు చెందిన కావులపల్లి అంజమ్మకు గురువారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో 108కు ఫోన్‌ చేశారు. పొదిలి 108 సిబ్బంది పి.రమేష్‌, ఈఎంటీ ఆదాము నాయుడుపేటకు వెళ్లి గర్భిణిని తీసుకొని పొదిలి వస్తున్నారు. ఈ సమయంలో నాయుడుపేటకు వచ్చేసరికి తీవ్రమయ్యాయి. ఈఆర్‌సీ వైద్యులు శ్రీకాంత్‌ సూచన మేరకు వాహనంలోనే కాన్పు చేసి పొదిలి ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో చేర్పించారు. తల్లి, మగ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో సిబ్బందిని వారు అభినందించారు.