ఐసీసీ వార్షిక అవార్డులు : అత్యుత్తమ వన్డే క్రికెటర్‌ కోహ్లీ

కొలంబో : భారత యువ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ గత యేడాది అత్యుత్తమ వన్డే క్రికెటర్‌ అవార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రతి యేడాది ఇచ్చే వార్షిక అవార్డులను కొలంబోలో ప్రధానం చేసిం ది. ఇందులో వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును విరాట్‌ కోహ్లీ అందు కున్నాడు. అలాగే శ్రీలంక మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ కుమార సంగక్కరకు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌తో పాటు టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పీపుల్స్‌ చాయిస్‌ అవార్డులు దక్కాయి. ఇదిలావుండగా, 23 యేళ్ల భారత క్రికెటర్‌ కోహ్లీ గత 12 నెలల్లో 31 వన్డేలు ఆడి 66.65 సంగటుతో 1733 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలు ఉన్నాయి. గత మార్చి నెలలో ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లీ సాధించిన 183 పరుగులే ఈ యువ క్రికెటర్‌ వ్యక్తగత అత్యదిక స్కోరు. కాగా, కోహ్లీ వన్డే కెరీర్‌లో ఇప్పటిదాకా 90 వన్డేలు ఆడిన కోహ్లీ 51.81 సగటుతో 3886 పరుగులు చేశాడు. టెస్టుల్లో పది మ్యాచ్‌లు ఆడి 41.35 సగటుతో 703 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇకపోతే. ఇతర అవార్డుల్లో టీ-20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా దక్షిణాఫ్రికా ఓపెనర్‌ రిచర్డ్‌ లెవీ ఎంపికకాగా, స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ డానియేల్‌ వెట్టోరికి లభించింది. ఇక ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా వెస్టిండీస్‌ యువ బౌలర్‌ సునీల్‌ నరైన్‌ ఎంపికయ్యాడు.