ఒకే కుక్క… ఒక్క రోజే… 50 మందిపై దాడి

` భైంసాలో పిచ్చికుక్క స్వైరవిహారం
` తీవ్రంగా గాయపడ్డ నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు
నిర్మల్‌(జనంసాక్షి):కుక్కల స్వైర విహారంతో జనం బెంబేలెత్తి పోతున్నారు. అవి దాడి చేసినప్పుడు హడావిడి చేస్తున్న అధికారులు తరవాత మరిచి పోతున్నారు. గ్రామం నుంచి పట్టణం వరకు కుక్కల బెడద తీవ్రం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాజా నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. సోమవారం ఒక్కరోజే 50మందిపై దాడిచేసి గాయపరిచింది. ఈ పిచ్చికుక్క దాడిలో నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో కుక్క కాటు బాధితులు భారీగా చేరారు. ఆస్పత్రి వైద్యులు తక్షణం మెడికల్‌ సహాయం అందిస్తున్నారు. పిచ్చి కుక్కలను పట్టుకోవడంలో మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి సరైన పరిష్కారం రాలేదని ఆవేదన చెందుతున్నారు. శునకాల దాడులతో తీవ్ర భయాందోళన చెందుతున్నామని వాపోయారు. తమ ప్రాణాలను కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. పిచ్చి కుక్కల దాడులపై ప్రభుత్వం, మున్సిపల్‌ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శునకాల దాడులు ప్రతిరోజూ పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. అధికారులు సకాలంలో స్పందించకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామని ప్రజలు హెచ్చరించారు. అధికారులు త్వరగా పిచ్చి కుక్కలను పట్టుకోవాలని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.