ఒడిశాలో నింగికెగసిన సామాన్యుడి క్షిపణి

– ప్రమాదమని నిపుణుల హెచ్చరిక
భువనేశ్వర్‌, జూన్‌23(జ‌నం సాక్షి) : క్షిపణులను తయారుచేసి ప్రయోగించడమంటే మామూలు విషయం కాదు. ఎంతో మంది సాంకేతిక నిపుణులు, కోట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలాంటి క్లిష్టమైన పనిని ప్రాణాలకు తెగించి సహజంగా దొరికే వస్తువులతో తయారు చేస్తున్నారు ఒడిశాలోని పూరి సవిూపంలోని ఓ మారుమూల పల్లె ప్రజలు. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణులను తయారు చేస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లాలో మారుమూల ప్రాంతం కనాస్‌. స్థానికంగా దొరికే వెదురు బొంగులతో ఇక్కడి ప్రజలు దేశీయ క్షిపణులను తయారు చేస్తున్నారు. అడవి నుంచి వెదురు బొంగులను సేకరించి వాటి మధ్యలో ఉన్న ఖాళీలో 5 కిలోల మందుగుండు సామాగ్రి నింపుతారు. దీనికి కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. గన్‌ పౌడర్‌ బొంగు మధ్యలోని ఖాళీలో సరిగ్గా కుదరడానికి పెద్ద పెద్ద చెక్క మొద్దుల సాయంతో బాదుతారు. ఇలా తయారైన బొంగులను జతచేసి 10 అడుగుల ఎత్తయిన, శక్తివంతమైన బాంబును తయారు చేస్తారు. ఒకసారి ఈ బాంబును మండిస్తే జివ్వు జివ్వున మంటలు కక్కుతూ రాకెట్‌లా ఆకాశంలో 10 కిలోవిూటర్ల ఎత్తుకుపైగా దూసుకుపోతుంది. ఈ ప్రయోగం చూసిన వారంతా అద్భుతమని కితాబిస్తున్నా.. ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ క్షిపణి విఫలమై కిందకు పడిపోతే వందలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ప్రసిద్ధి చెందిన ఐశనేశ్వర్‌ జాతరలో క్షిపణి ప్రయోగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జాతర ప్రారంభమయ్యే రోజును పురస్కరించుకుని ప్రతి ఏటా కనాస్‌ గ్రామానికి వచ్చే లక్షలాది మంది భక్తులు క్షిపణులను మండిస్తున్నారు. రాత్రి వేళల్లో రంగురంగుల క్షిపణులు గాల్లోకి దూసుకెళ్లడాన్ని చూడడానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. అయితే మత సాంప్రదాయం ముసుగులో.. చూసేవారి ప్రాణాలతో చెలగాటం అడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా సాగుతున్న ఈ ఆచారాన్ని రద్దు చేయాలని జిల్లా, ప్రాంతీయ యంత్రాంగం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బాణసంచా మండించడాన్ని తమ ఇలవేల్పు పరమశివుని అనుగ్రహంగా భావించడం వల్ల ఈ ఆచారాన్ని
కొనసాగిస్తున్నామని అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఉత్సవ ప్రారంభానికి లక్షల మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీంతో మత సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్సవంపై ఆంక్షలు విధించడం పాలనా యంత్రాంగానికి సవాల్‌గా మారింది.