ఓటమిపై దిగులు చెందొద్దు
` మనది ఎప్పుడూ ప్రజాపక్షమే
` రెండు నెలలైనా హామీలు పట్టని కాంగ్రెస్
` హరీశ్‌రావు విమర్శలు
హైదరాబాద్(జనంసాక్షి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు జనగామ అంటే అమితమైన ప్రేమ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎప్పుడూ ఈ ప్రాంతం గురించి ప్రస్తావన తెస్తుంటారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామలో గులాబీజెండా ఎగురవేసిన సైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జనగామ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తలతో బుధవారం జరిగిన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనకు ఉద్యమాలు, అరెస్టులు కొత్త కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు, వైఎస్ హయాంలో నిర్బంధాలను చూసిన గడ్డ ఇది అని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. మనది ఎప్పుడూ ప్రజాపక్షమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి 60 రోజులు పూర్తయ్యిందని హరీశ్‌రావు తెలిపారు. వంద రోజుల్లో ఇచ్చిన హావిూలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారని తెలిపారు. రూ.4వేల పింఛన్ ఇస్తామని ఊదరగొట్టారని.. కానీ ఉన్న రెండు వేల పెన్షన్‌ను కూడా కట్ చేశారని విమర్శించారు. కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతుబంధు ఆగిందా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే రూ.15వేలు ఇస్తామన్నారని తెలిపారు. కానీ ఉన్న రూ.10 వేలు పోయింది.. వేస్తామన్న రూ.15వేలకు కూడా దిక్కులేదని అన్నారు.నిరుద్యోగ భృతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అబద్దాలు చెబుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో భట్టిని నిలదీస్తే సమాధానం లేదని అన్నారు. గ్రామాల్లో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు మోసాలు చేసిందని మండిపడ్డారు. హావిూల అమలులో సీఎం రేవంత్ రెడ్డి ఎగవేత, దాతవేట వైఖరిని ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఎన్నికల కోడ్ వస్తే హావిూలకు ఎగనామం పెట్టాలని చూస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల కోడ్ రాకముందే హావిూలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే కాంగ్రెస్‌కు రైతులు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.మహాలక్ష్మీ పథకం ఏమైందని హరీశ్‌రావు నిలదీశారు. మహాలక్ష్మీ ఇవ్వకుండా ఆడబిడ్డలను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో.. లేదో.. కరెంట్ కోతలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఎడాపెడా కరెంట్ కోతలు విధిస్తూనే ఉన్నారు. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విూటింగ్‌లోనూ ఇదే సమస్య ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జనగామ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న కరెంట్ పరిస్థితి గురించి వివరించారు. సరిగ్గా కరెంట్ పరిస్థితిని వివరిస్తుండగానే విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిరది. దీంతో మార్పు వచ్చిందంటూ హరీశ్‌రావు సెటైర్ వేశారు. ఈ మాట వినగానే సభ అంతా నవ్వులతో నిండిపోయింది. కాగా, జనరేటర్ ఆన్ చేయడంతో హరీశ్‌రావు మళ్లీ తన ప్రసంగం కొనసాగించారు.