ఓటమి భయంతోనే..  టీఆర్‌ఎస్‌ వేదింపులకు పాల్పడుతుంది


– పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేస్తా
– ప్రజా ఆకాంక్షల మేరకే మహాకూటమి సీట్ల సర్దుబాటు ఉంటుంది
– కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌
కరీంనగర్‌, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే అసహనంతోనే టీఆర్‌ఎస్‌ పార్టీ వేధింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. శనివారం  ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఓడి పోతాననే భయంతోనే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకుల విూద దాడులకు పాల్పడుతోందని విమర్శిచారు. తాను పార్లమెంట్‌ అభ్యర్థినని.. కానీ పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ప్రజల ఆకాంక్షల మేరకే ప్రజా కూటమి సీట్ల సర్దుబాటు ఉంటుందని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటికి టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. కోడ్‌ ఉల్లంఘనలను,  అధికార దుర్వినియోగాలను ఎన్నికల కమిషన్‌ సుమోటోగా స్వీకరించారని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు కసితో కాంగ్రెస్‌ను గెలిపిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాలుగేళ్లు పాలించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందన్నారు. మిషన్‌ భగీరథలోనూ, ప్రాజెక్టుల నిర్మాణంలోనూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హావిూల్లో ఒక్కటి అమలు చేయలేదని, కేవలం మాటలకే పరిమితం చేశారన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి అంటూ బర్రెలు, గొర్రెలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని పొన్నం విమర్శించారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్‌ మరోసారి ప్రజల్లో పువ్వులు పెట్టేందుకు యత్నిస్తున్నారని ప్రజలు కేసీఆర్‌ కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పోన్నం పేర్కొన్నారు.