ఓటమి భయంలో కాంగ్రెస్‌ కూటమి

సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష

మరోమారు గెలిపించి ఆశీర్వదించండి

ప్రచారంలో సోమారపు సత్యనారాయణ

రామగుండం,నవంబర్‌10(జ‌నంసాక్షి): ఓటమి భయంతోనే కాంగ్రెస్‌, టిడిపి తదిర పార్టీలు కేటమి కట్టారని, కూటమి నేతల మాటలు నమ్మొద్దని రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు.

అన్నివర్గాలను ఆదుకుని తెలంగాణ అభివృద్దిని ముందు నిలిపిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు. సింగరేణి కార్మికులకు గతంలో ఎప్పుడూ లేని గౌరవాన్ని ఇచ్చిన ఘనత కూడా కెసిఆర్‌దన్నారు. అందుకే ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ మహాకూటమి ఏర్పాటు చేసిందని అన్నారు. పట్టణంలో ఇంటింటా ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక తెలంగాణ ద్రోహం చేసిన పార్టీలన్నీ మహాకూటమి పేరుతో ఏకమయ్యాయన్నారు. వారి ఎత్తుగడలను ప్రజలు తిప్పి కొటేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మహాకూటమిలో సీట్ల కొట్లాట ఇంకా కొనసాగుతుందని, దీంతో కూటమి నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు మళ్లీ పట్టం కట్టబోతున్నారని, కేసీఆర్‌ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ ఎకరానికి సాగు నీరు అందజేస్తామని చెప్పి కాళేశ్వరం చేప్టటారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ,కాంగ్రెస్‌ పార్టీలు చేయాలేని అభివృద్ధిని, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ నాలుగేండ్లలోనే చేసి చూపారన్నారు. 400 రకాల సంక్షేమ పథకాలు చేపట్టి ప్రతి ఇంటికీ లబ్ధి చేకూర్చాలని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతు బంధు, రైతుబీమా పథకాలు, ఉచితంగా 24 గంటల కరంటు అందిస్తున్నారని తెలిపారు. తనను మళ్లీ ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హావిూ ఇచ్చారు. కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కుల వృత్తుల అంతరించి పోయాయని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే మళ్లీ పూర్వ వైభవం సంతరించు కున్నాయన్నారు. అదే విధంగా శివారు పల్లెలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో మళ్లీ కేసీఆరే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డుపడుతున్న కాంగ్రెస్‌, టీడీపీలు ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నాయని ప్రశ్నించారు. 60 ఏండ్ల జరగని అభివృద్ధిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం నాలుగున్నర సంవత్సరాల్లోనే చేసిందని వారు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన జాతీయ సర్వేలో రాష్ట్రం లో టీఆర్‌ఎస్‌ పార్టీకి 95 నుంచి వంద సీట్లు వస్తాయని తేలిందన్నారు.