ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేయడానికి గరుడ యాప్ : కలెక్టర్ శ్రీహర్శ

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 10 : గరుడ యాప్ గురించి అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని బాలభవన్లో బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బూత్ లెవెల్ అధికారులు సూపర్వైజర్లు ఇంటింటికి తిరిగి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక ఓటరు గరుడ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని తమ పేర్లు నమోదు చేసుకోవాలని,ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేయాలని అన్నారు. ఇదివరకే నమోదు చేసుకున్నవారు ఆధార్ నెంబర్ను గరుడ యాప్ ద్వారా లింక్ చేయాలని అన్నారు. ఎవరైనా ఓటర్ మరణిస్తే వారి మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుని వారి పేర్లను అప్లోడ్ చేయాలని తెలిపారు. జిల్లాలో ఎవరైనా వికలాంగ ఓటర్లు ఉంటే వారి వికలత్వం ఎంత శాతం ఉందో యాప్ లో నమోదు చేయాలన్నారు. జిల్లాలో బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు ప్రతిరోజు పదిమంది నీ గరుడ యాప్ లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 2023 లోపు ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం గద్వాల నియోజకవర్గ 79, అలంపూర్ నియోజకవర్గం 80 ఫారం 6 బి, ఫారం 8 లలో మార్పులు చేర్పులు జరిగాయని తెలిపారు. ఓటరుగా నమోదు చేసిన వెంటనే వారి ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్డీవో రాములు, ఇ డి ఎస్సి కార్పొరేషన్ అధికారి రమేష్ బాబు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమాధికారి ముసాయిదా బేగం, సూపరింటెండెంట్ మదన్మోహన్, బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.