*ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి*

*17 ఏళ్లు దాటిన యువత దరఖాస్తు చేసుకోవాలి*
….. తహసీల్దార్ యేసయ్య
పానుగల్ ఆగస్టు 17( జనం సాక్షి)
 ప్రతీ ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అని పానుగల్ తహసీల్దార్ పి.యేసయ్య అన్నారు.ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం మరియు కొత్త ఓటరు నమోదు ప్రక్రియపై బుధవారంనాడు మండల కేంద్రంలోని రైతువేదికలో మండల పరిధిలోని 43 మంది బూత్ లెవెల్ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గారు మాట్లాడుతూ.. ఈ నెల 4 తేదీ మొదటివారం నుండి బీఎల్‌వోలు ఇంటింటికీ వచ్చి ఓటరు కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా ఇంతవరకు ఎన్ని ఆధార్ కార్డులు సేకరించనది పోలింగ్ కేంద్రాల వారీగా వివరాలు అడిగి తీసుకున్నారు. ఇట్టి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని బీఎల్‌వోలను ఆదేశించారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారంగా ప్రతీ ఓటరుకి కొత్త ఎలక్ట్రానిక్‌ కార్డులు అందజేస్తామన్నారు. ఆన్‌లైన్‌లో గానీ, తహసీల్దార్‌ కార్యాలయంలో గానీ కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ఓటరు కార్డుల్లో తప్పులు దొర్లితే సరిచేసుకోవచ్చునన్నారు.
గతంలో ప్రతిఏటా జనవరిలోనే కొత్త ఓటరు నమోదు కార్యక్రమం జరిగేదని, 2023 నుంచి జనవరి1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబరు 1 తేదీల్లో కొత్త ఓటు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. 17 సంవత్సరాలు దాటిన యువతీ, యువకులు దరఖాస్తు చేసుకుంటే వారికి 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరు కార్డు వస్తుందన్నారు. హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా కూడా ఓటరు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఓటరు కార్డులో తప్పులు దొర్లినట్లయితే ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకొని సరి చేసుకోవచ్చునని తెలిపారు. కొత్త ఓటర్‌ రిజిస్టేషన్‌ కోసం ఫారం-6ను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జి.చక్రపాణి, గిర్దావర్లు పి.మహేష్, ఎ. తిరుపతయ్య, ఐ.సి.డి.ఎస్ పర్యవేక్షకురాలు సువర్ణ, ఆపరేటర్లు కె.సంతోష్ చారి, కె.బి. జగదీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు