ఓటింగ్ పెరగకుండా టీఆర్‌ఎస్ అడ్డుకుంది..
– పోలింగ్ శాతాన్ని పెరగకుండా టీఆర్‌ఎస్సే అడ్డుకుందట
– బండి సంజయ్ ఆరోపణ
హైదరాబాద్,డిసెంబరు 1(జనంసాక్షి): ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని భాజపా మొదటి నుంచీ కోరుకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి అన్ని విధాలా సహకరించామన్నారు. ఓటింగ్ శాతం తగ్గించే ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం తెరాసకు సహకరించడం సిగ్గుచేటన్నారు. పోలింగ్ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అనేక చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయని.. అయితే ఎక్కడ కూడా భాజపా కార్యకర్తలు గొడవలకు దిగలేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలింగ్‌లో పాల్గొన్న ప్రజలు, భాజపాకు అన్ని విధాలుగా సహకరించిన కార్యకర్తలు, పాత్రికేయులు, పోలింగ్ సిబ్బందికి భాజపా రాష్ట్ర శాఖ తరఫున బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.”భాజపా విద్వేషాలు రెచ్చగొడుతుందని.. మతం పేరుతో ఎన్నికల్లో పోటీ చేస్తోందని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే విమర్శలు చేశారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించే పార్టీలు రెండే ఉన్నాయి. అవి తెరాస, మజ్లిస్ పార్టీలే. గ్రేటర్‌లో భాజపా విజయం ఖాయమని సర్వేలన్నీ చెప్పడంతో అడ్డదారిలో గెలవాలని ఆ రెండు పార్టీలు ప్రయత్నించాయి. ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు అరాచకాలు సృష్టించారు. వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలోనే పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మద్యం, నగదు పంపిణీ చేయడమే కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. దుబ్బాక ఎన్నికల ఫలితాన్ని గుర్తు పెట్టుకున్న సీఎం కేసీఆర్.. గ్రేటర్ పోరులోనూ ప్రజలు ఓటు వేయరని ముందుగానే ఊహించారు. పథకం ప్రకారమే పోలీసు, ఎన్నికల సంఘం సమన్వయంతో నాలుగు రోజులు సెలవు వచ్చేలా చేశారు. దీనిలో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల విధులు వేయకుండా తెరాసకు అనుకూలంగా ఉండే వ్యక్తులను విధుల్లోకి తీసుకున్నారు. వారికి అవగాహన లేకపోవడంతోనే అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తాయి” అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు,