ఓటుకు నోటు కేసులోబాబుకు తాత్కాలి ఊరట

5

– 8 వారాలపాటు విచారణపై స్టే

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో ఊరట దక్కింది. ఈ కేసుపై కోర్టు  స్టే విధించింది.  కేసుకు సంబంధించి తెలంగాణ ఎసిబి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎసిబి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ ను విచారించిన హైకోర్టు చంద్రబాబుకు స్టే ఇస్తూ, వివరంగా కౌంటర్‌ ఇవ్వాలని ప్రతివాదులను  ఆదేశించింది. తెలంగాణ ఎసిబి, గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామకృస్ణారెడ్డి ప్రతివాదులుగా ఉన్నారు. ఎసిబికోర్టు ఆదేశాలపై హైకోర్టుకు చంద్రబాబు వెళ్లగా, ఎనిమిది నుంచి పది నిమిషాలలోనే విచారణ ముగిసింది. ఎసిబి కోర్టు తీర్పుపై మెమో ఎందుకు దాఖలు చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. రామకృష్ణారెడ్డి తరపు లాయర్‌ మాట్లాడుతూ చంద్రబాబు దీనిపై ఇప్పుడే హైకోర్టుకు రాకూడదని అన్నారు. హైకోర్టు ఆ తర్వాత స్టే ఇస్తూ, వివరణాత్మక నివేదికలు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. కౌంటర్‌ ఇచ్చే వరకు ఈ స్టే వర్తిస్తుందని న్యాయవాదులు తెలిపారు.

ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాలపై హైకోర్టు 8 వారాల పాటు స్టే మంజూరు చేసింది. ఈ కేసులో తనపై విచారణను నిలిపివేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం ఉదయం కోర్టులో వాదనలు జరిగాయి. ఏసీబీ కోర్టును ఆశ్రయించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తరఫున పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. గతంలో రేవంత్‌ రెడ్డి తరఫున బెయిల్‌ కోసం ఈయన వాదించారు. తొలుత ఆర్కే తరఫు న్యాయవాది సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను ఏ కోర్టూ అడ్డుకోలేదని, ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని ఆయన వాదించారు. ఆయన వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఏసీబీ మెమో ఎలా దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. సెక్షన్‌ 156 ఆర్డర్‌పై స్టే అడిగే హక్కు పిటిషనర్‌కు లేదని సుధాకర్‌రెడ్డి చెప్పగా, ఆయన వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. అనంతరం ఏసీబీకోర్టు ఆదేశాలపై 8 వారాల పాటు స్టే మంజూరు చేసింది. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, ఎమ్మెల్యే ఆర్కేలు సవివరమైన కౌంటర్‌ దాఖలు చేయాలని తెలిపింది. హైకోర్టు ఆదేశాలపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు స్వరనమూనాలను వివిధ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లలో పరీక్షలకు పంపి, ఆ నివేదికల ఆధారంగానే ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.