ఓట్లు రాగానే మనం ఆగం కావద్దు…ఆలోచన చేయాలే..!
60 ఏండ్ల కాంగ్రెస్ క్యాడర్ కన్నా మనమే ఎక్కువ ఉన్నం
– గడపగడపకు బీఆర్‌ఎస్‌పార్టీ మేనీఫెస్టోను తీసుకెళ్లాలే
– బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
జనంసాక్షి, రామగిరి, అక్టోబర్ 27 : ఎన్నికలు రాగానే మనల్ని కాంగ్రెస్సోల్లు ఆగం చేస్తారని, మనం ఆగం కాకుండా ఆలోచన చేయాలని బీఆర్‌ఎస్ పార్టీఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరికాలనీ లోని సాయిరాం గార్డెన్ లో రామగిరి మండల బీఆర్‌ఎస్‌పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంథని నియోజకవర్గంలోని మహాదేవ్‌పూర్, మహముత్తారం, కమాన్‌పూర్, ముత్తారం మండలాల్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని, నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహం కన్పిస్తోందన్నారు. గతంలో కంటే ఈసారి ఉమ్మడి కమాన్‌పూర్ మండలం నుంచి పది వేల మెజార్టీ వచ్చేలా కన్పిస్తుందని ఆయన అన్నారు. అయితే ఇంత పెద్ద సంఖ్యలో మనం ఉన్నా ఇంకా అనేక విషయాల్లో వెనుకబడి పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 60ఏండ్ల కాంగ్రెస్ క్యాడర్ కన్నా ఆ కుటుంబ పరిపాలన కన్నా బీఆర్‌ఎస్ కుటుంబసభ్యులే పెద్ద సంఖ్యలో ఉన్నామని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ కండువాలు కప్పుకునేటోళ్లను, ఇప్పటికే ఏండ్లకు ఏండ్లుకాంగ్రెస్ జెండా మోస్తూ ఊర్లలో కాంగ్రెస్ కోసం పనిచేసే నాయకులు కార్యకర్తలను చూస్తుంటే ఇంత అమాయకులు ఇంకా దేశంలో ఉంటరా అనిపిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే చీకటి అని, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అదికారంలోకి వచ్చినా అక్కడ వెలుగులు ఉండవని ఆయన అన్నారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ఉండకూడదని, భూస్తాపితం చేయాలని ఆనాడే మహాత్మాగాంధీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అంటే ఆనాడే కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గమైన పాలన అందించిందో అర్థం చేసుకోవాలన్నారు. ఇంకను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాయ్ హోటళ్ల కాడ, చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ గొప్పలు, ఇక్కడి పాలకుల పనితీరు గురించి గొప్పగా చెప్పుతూ అనేక అబద్దాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని, కాంగ్రెస్ అబద్దాలను కట్టడి చేయడంలో బీఆర్‌ఎస్ పార్టీ సైనికులు ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆనాడు 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి అమాయకంగా ఉంటూ ప్రజలను నమ్మించి మోసం చేసి మనల్ని దొంగదెబ్బ తీసిన విషయాన్ని మర్చిపోవద్దని, కాంగ్రెస్ అభ్యర్థి ఏ విధంగా మోసం చేస్తాడో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యేగా తాను గెలిచిన తర్వాత అనేక సేవలు చేస్తే ఆ సేవలను కన్పించకుండా చేసి తాను కోట్లు కూడబెట్టాననే అబద్దాన్ని ప్రజలు నమ్మే విదంగా చేశాడని ఆయన గుర్తు చేశారు. అబద్దాలను నమ్మిన ప్రజలు తనను దూరం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఏం చేయలేదని, ఐదేండ్లు మా ప్రభుత్వం లేదంటూ దాటవేశాడే తప్ప అభివృధ్ది పనులు కానీ పైసా సాయం కానీ చేశాడా అని ఆయన ప్రశ్నించాడు. ఐదేండ్లు ఏ పని చేయకుండా మా ప్రభుత్వం లేదని చెప్పి మళ్లీ ఓట్ల కోసం ఊర్లకు వస్తున్నాడని అన్నాడు. ఏ పని చేయకుండా ఐదేండ్లు వృధా చేసిన ఎమ్మెల్యేకు మద్దతుగా తిరిగే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం మూడు ఓట్లు ఉన్న ఆ కుటుంబానికే అధికారం అప్పగించడాన్ని ఏమనుకోవాలని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మరోసారి మభ్యపెట్టాలని అన్నాదమ్ముళ్లు ఊర్లలో తిరుగుతున్నారని, కోట్లు పెట్టి లీడర్లను కొనుగోలు చేస్తూ నిక్కాస్సైన నాయకులపై అబండాలు వేస్తూ అమ్ముడు పోతున్నారని అవమానపరుస్తున్నారని ఆయన వాపోయారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడి ప్రజలకు ఏం చేసిండ్లో మళ్లీ ఏం చేస్తరో చెప్తలేరని, కేవలం గ్యారెంటీ వారెంటీ పథకాలతో మాత్రమే ముందుకు వస్తున్నారని అన్నారు. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇప్పటికే అనేక పథకాలు అమలు చేశామని, మరిన్ని గొప్ప పథకాలకు రూపకల్పన చేసినట్లు ఆయన వివరించారు. నోట్ల సంచులు, మందుసీసాలను నమ్మకున్నపార్టీ కాంగ్రెస్‌పార్టీ , ఆ పార్టీ అభ్యర్థి అని, ప్రజలను నమ్మకున్న పార్టీ బీఆర్‌ఎస్ పార్టీ, తాను అని ఆయన అన్నారు. గడపగడపకు బీఆర్‌ఎస్‌పార్టీ ఎన్నికల మేనీఫెస్టోను తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారని, ఇప్పటికే అమలుచేస్తున్న పథకాలతో పాటు రాబోయే పథకాలను వివరించాలన్నారు.ఈ పథకాలతో పాటు తాను సొంతంగా మరిన్న సేవలు అందిస్తానని, పేదింటి ఆడబిడ్డల కోసం సామూహిక వివాహాలు, పేద విద్యార్ధుల ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌లో రెండు హస్టల్ వసతి కల్పించి రూపాయి ఖర్చు కాకుండా ఉన్నత చదువులు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తానని, ప్రభుత్వం ద్వారా అందించే గృహాలక్ష్మి పథకంలో దగ్గరుండి ఇంటి నిర్మాణం చేసి గృహ ప్రవేశం చేయిస్తానని ఆయన హమీ ఇచ్చారు. నాటికి నేటికి అభివృధ్ది సంక్షేమ పథకాలు, సేవలపై బేరీజు వేసుకుని ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు గొప్పగా ఆలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు.