ఓట్ల కోసం చరిత్రను వక్రీకరిస్తారా?
బిజెపి మాత్రమే అభివృద్దికి పాటుపడగలదు: ఆచారి
మహబూగ్‌నగర్,నవంబర్13(జనంసాక్షి): నిజాం పరిపాలనను సీఎం కెసిఆర్ పొగడటం హిందువుల మనోభావాలను కించపర్చడమేనని బిజెపి రాష్ట్ర కార్యదర్శి, కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి అన్నారు. కేవలం ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. ఇలాంటి పార్టీని ఎత్తుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదన్నారు. తెరాస గెలుస్తోందని చెప్పిన సర్వేలన్నీ ఓ నాటకం.. వంద సీట్లు గెలుస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మరాదని సూచించారు. ఇచ్చిన హావిూలు నెరవేర్చనివారు ఎలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల పేరుతో కవిూషన్లు తీసుకున్నారే తప్ప పథకాలను పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధికి భాజపాయే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, తెరాసలు ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేవిూ లేదని చెప్పారు. అమలుకు నోచుకోని తెరాస హావిూలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి మోదీ కోట్లాది రూపాయలు రాష్ట్రానికి కేటాయిస్తే వాటిని మళ్లించి ఇతర అవసరాలకు వినియోగించుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోరన్న నమ్మకం భాజపా ఉందన్నారు. తెలంగాణ చరిత్ర తెలియకుండా కేసీఆర్ మాట్లాడటం విడ్డూరమన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని పలికిన దాశరథి కృష్ణమాచార్యను నిజామాబాద్ ఖిల్లా జైలులో ఎందుకు బంధించారో తెలియదా ? అని ప్రశ్నించారు. చరిత్రను వక్రీకరించేలా ఎవరు ప్రవర్తించినా రాష్ట్ర ప్రజలు సహించబోరని, త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.నిజాం పరిపాలనలో హిందువులు ఎన్నో హింసలకు గురయ్యారని గుర్తుచేశారు. మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించడంతో పాటు ఊచకోతలు కోశారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణలోనే 3,200 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడే వారిపై ఉక్కుపాదం మోపుతోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాలన్నారు. ఆంధ్రా పాలన వద్దని చెప్పిన ప్రభుత్వమే వారి చెంతకు చేరుతోందన్నారు. ఈ ఎన్నికల్లో కూటమిని, టిఆర్‌ఎస్‌ను ప్రజలు బొందపెడతారని అన్నారు.