ఓయూలో కొనసాగుతున్న ఉద్రిక్తత
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (జనంసాక్షి) :ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్ళీ ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్ధులు మరోసారి ఆందోళనకు దిగారు. తెలంగాణ మార్చ్‌కు ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే అడ్డుంటూ ఆరోపిస్తూ ర్యాలీకి దిగారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినా దాలు చేస్తు క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహి స్తున్న విద్యార్ధులను పోలీసులు మెయిన్ గేటు వద్ద అడ్డుకున్నారు. విద్యార్ధులు క్యాంపస్ నుంచి బయటకు రాకుండా గేట్లు మూసివేశారు. ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్ధులు రెచ్చిపోయి పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు విద్యార్ధులపై భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. విద్యార్ధులపై లాఠీచార్జ్ కూడా చేశారు. పలువురు విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్ధులకు స్వల్పంగా గాయలయ్యాయి. గురువారం కూడా ఉస్మానియాలో గందరగోళ పరిస్థితి నెలకొంది. విద్యార్ధులు చేపట్టిన కవాతును పోలీసులు అడ్డుకున్నారు. బాపూజీ జన్మదినం సందర్భంగా జలదృశ్యంవరకు కవాతు నిర్వహించాలని విద్యార్ధులు నిర్ణయించారు. దీన్ని పోలీసులు ఓయు గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన విద్యార్ధులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులపై కూడా భాష్పవాయువు గోళలు ప్రయోగించారు. క్యాంపస్ చుట్టూ పోలీసులు మొహరించారు. ఈ ఘటనలో ఒక విూడియా ప్రతినిధితో పాటు పలువురు విద్యార్ధులు, పోలీసులకు గాయాలయ్యాయి.