ఓరుగల్లు..పోరుగల్లు

సీఎం పర్యటనపై ఉద్యమ నిప్పుల వర్షం
నల్లారి ఆగమాగం.. పగిలిన సీఎం బస్సు అద్దాలు
బుల్లెట్‌ ప్రూఫ్‌ కారులోకి మారిన సీఎం
దారిపొడవునా నిరసనల హోరు
సభలో పోటెత్తిన జై తెలంగాణ
రెండంటే రెండు నిమిషాలు సీఎం ప్రసంగం
అఖిలపక్షంపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణవాదుల డిమాండ్‌
వరంగల్‌లో ఉద్రిక్తత
వరంగల్‌,డిసెంబర్‌ 21(జనంసాక్షి) :
కాకతీయ ఉత్సవాల ప్రారంభ వేడుకల్లో రసాభాస చోటుచేసుకుంది. ఉత్సవాల ప్రారంభానికి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. హన్మకొండలో ముఖ్యమంత్రి కాన్వా య్‌పై తెలంగాణవాదులు రాళ్లదాడి చేశారు. రాళ్లదాడి లో సీఎం ప్రయాణిస్తున్న బస్సు అద్దాలు ధ్వంసమ య్యాయి. దీంతో పోలీసులు సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డిని బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో తరలిం చారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉత్సవ వేదికకు చేరు కునేలా చేశారు.సిఎం ప్రయాణిస్తున్న బస్సుపై దాడిచేసిన తెలంగాణ వాదులు రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆ సమ యంలో సిఎం ముందు
సీట్లో కూర్చుని ఉన్నారు. కేయూ విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తపరిచారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపుచేయడానికి లాఠీచార్జి చేసి, పలువురు తెలంగాణ వాదులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.శుక్రవారం మధ్యాహ్నం కాకతీయ ఉత్సవాల ప్రారంభవేడుకలలో పాల్గొనడానికై- సీఎం కిరణ్‌ వరంగల్‌ జిల్లాకు వచ్చారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా బొమ్మకూరులో నిర్మించిన రిజర్వాయర్‌కు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు- చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. కాగా పలువురు తెలంగాణ వాదులు, విద్యార్థులు సీఎం ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. సభలో ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోనికి తీసుకున్నారు.
అంతకు ముందు ఎల్‌పీడీసీఎల్‌, హరిత ¬టల్‌ ప్రారంభించడానికి వచ్చిన సీఎం కాన్వాయ్‌ను తెలంగాణ వాదులు అడ్డుకుని రాళ్లదాడి చేశారు. వారిని పోలీసులు అడ్డుకుని సీఎం కాన్వాయ్‌ను అక్కడి నుంచి తరలించగా తిరిగి వెళ్లే సమయంలో స్థానికులు కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు. పోలీసులు వెంటనే స్పందించి పలువురు విద్యార్థులు, తెలంగాణ వాదులను అరెస్ట్‌ చేశారు.
అక్కడి నుంచి ఓరుగల్లు ఖిల్లాకు సీఎం కాన్వాయ్‌ బయలుదేరింది. మరికాసేపట్లో కాకతీయ ఉత్సవాలు ప్రారంభంకానున్నాయనగా దాడి చేయడంతో సిఎంను బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో తరలించారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మూమునూరుకు తరలించి వరంగల్‌ ఖిల్లా వద్ద కాకాతీయ ఉత్సవాల ప్రాంగణానికి చేర్చారు. అక్కడి ప్రాంగణంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.
సీఎం బస్సుపై తెలంగాణ వాదులు రాళ్లదాడి
వరంగల్‌ జిల్లా పర్యటనలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి అడుగడుగునా నిరసనలు తెలిపారు. . హన్మకొండలో సీఎం ప్రయాణిస్తున్న బస్సుపై పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు రాళ్లు రువ్వారు. ఆయన ప్రయాణిస్తున్న బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలమని కాంగ్రెస్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణపై సీఎం కిరణ్‌ స్పష్టమైన వైఖరి చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన సీఎంకు కాకతీయ ఉత్సవాలను ప్రారంభించే అర్హత ఆయనకెక్కడిదని నిలదీశారు. ఇవి కాకతీయ ఉత్సవాలు కాదని, కిరణ్‌కుమార్‌ ఉత్సవాలని వారు విమర్శిస్తున్నారు.
సీఎం వరంగల్‌ పర్యటన రక్తసిక్తం
వరంగల్‌లో సీఎం పర్యటన రక్తసిక్తమైంది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేస్తూ అడ్డుకున్న తెలంగాణ వాదులను పోలీసులు చితకబాదారు. సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడికి పాల్పడిన తెలంగాణ వాదులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. దీంతో పలవురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారు. వేలాదిగా పోలీసుల ఉన్నా తెలంగాణ వాదులు వెరవకుండా . రెట్టింపు ఉత్సాహంతో సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. పోలీలసులు తెలంగాణవాదులను అరెస్టు చేసి స్టేషన్‌లకు తరలించారు. ఈ లాఠీఛార్జీలో ఎంతోమంది తెలంగాణ వాదుల తలలు పగిలాయి.
బుల్లెట్‌ప్రూఫ్‌ కారులోకి మారిన సీఎం
కాకతీయ ఉత్సవాల్లో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన సీఎంకు తెలంగాణ వాదుల నుంచి నిరసనలు ఎదురుకావడంతో ఆయన ప్రయాణిస్తున్న బస్సు అద్దాలను తెలంగాణ వాదులు ధ్వంసం చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు బుల్లెట్‌ప్రూఫ్‌ కారును ఏర్పాటు- చేశారు. ఆయన ఆ కార్లోనే కాకతీయ ఉత్సవాలు జరిగే ఖిలా వరంగల్‌ చేరుకున్నారు.
అయినా తెలంగాణ వాదులు వదలకుండా బుల్లెట్‌ ప్రూఫ్‌ కారుపైకి కూడా రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. ఉద్యమకారుల ఆందోళన కారణంగా వెంకట్రామ జంక్షన్‌ వద్ద ప్రారంభించాల్సిన సర్దార్‌పటేల్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. సీఎం కిరణ్‌ రోడ్డు మార్గాన ప్రయాణాన్ని రద్దు చేసుకుని హన్మకొండలోని జేఎన్‌ఎస్‌ నుంచి మామూనూరు విమానాశ్రయానికి చేరుకున్నారు.
సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న న్యాయవాదులు
నూతనంగా నిర్మించిన హరిత హాటల్‌ను ప్రారంభించేందుకు సీఎం వెళ్తుండగా తెలంగాణ న్యాయవాదులు సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. జైతెలంగాణ నినాదాలతో నిరసన తెలిపారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని వారు డిమాండ్‌ చేశారు. కాగా, హరిత ¬టల్‌ ప్రాంగణంలో పెద్ద ఎత్తున జనం గుమిగూడి సీఎంకు నిరసనలు తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.