ఓల్డ్‌ మలక్‌పేట్‌లో రేపు రీపోలింగ్‌

– గుర్తులు తారుమారు..

హైదరాబాద్‌,డిసెంబరు 1(జనంసాక్షి):ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తారుమారయ్యాయి. దీంతో అక్కడ పోలింగ్‌ను రద్దు చేశారు. ఇక్కడ రేపు రీ పోలింగ్‌ నిర్వహించనున్నారు.ఆ డివిజన్‌లో ఉన్న 69 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ ఉంటుందని ఎన్నికల కమిషన్‌ పేర్కొన్నది. గ్రేటర్‌ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. ఓల్డ్‌ మలక్‌పేటలో సీపీఐ, సీపీఎం గుర్తుల విషయంలో పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది. బ్యాలెట్‌ పత్రంపై గుర్తులు తప్పుగా ప్రింట్‌ కావడం వల్ల ఆ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. గుర్తుల మార్పుపై అక్కడి అభ్యర్థులు రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు అందజేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత రావాల్సిన ఎగ్జిట్‌ పోల్స్‌ను కూడా నిషేధించినట్లు ఎస్‌ఈసీ పార్థసారధి చెప్పారు. రీపోలింగ్‌ ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడికానున్నాయి.