ఓ సెల్ఫీ ఖరీదు.. మూడు నిండు ప్రాణాలు!

akshaya
 ఆగ్రా :

సెల్ఫీలు తీసుకోవడం అందరికీ సరదానే. కానీ ఆ సరదా ఒకోసారి వికటిస్తే పెను ప్రమాదంగా మారుతుంది. ఇలాగే ముగ్గురు కాలేజి పిల్లలు చేసిన సెల్ఫీ ప్రయత్నం.. వాళ్ల ప్రాణాలు బలిగొంది. వేగంగా వస్తున్న రైలు ఎదుట నిలబడి సెల్ఫీ తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలన్న ప్రయత్నం ముగ్గురు స్నేహితుల మరణానికి కారణమైంది. ఢిల్లీ, మొరాదబాద్, ఫరీదాబాద్లకు చెందిన ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు.

నలుగురు మిత్రులు కలిసి రిపబ్లిక్ దినోత్సవం రోజున తాజ్మహల్ చూసేందుకు ఆగ్రా బయల్దేరారు. రైల్వేట్రాక్ చూడగానే తమకు అక్కడ సాహసం చేయాలనిపించి కారు ఆపామని, వేగంగా వస్తున్న రైలు దగ్గర సెల్ఫీ తీసుకోడానికి ఆగామని ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో బయటపడిన అనీష్ అనే నాలుగో అబ్బాయి చెప్పాడు. మరణించిన ముగ్గురి పేర్లు యాకూబ్, ఇక్బాల్, అఫ్జల్. వీళ్లంతా 20-22 ఏళ్ల మధ్య వయసువాళ్లే. రైలు రావడానికి కొద్దిక్షణాల ముందు ఫొటో తీసుకుని, అక్కడినుంచి దూకేద్దామనుకున్నా.. ఈలోపే వేగంగా వచ్చిన రైలు వారిని ఢీకొంది. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు పంపారు.