ఔరంగాజేబు కుటుంబానికి రక్షణమంత్రి పరామర్శ

 

కుటుంబానికి అండగా ఉంటామని హావిూ

శ్రీనగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి): ఇటీవల ఉగ్రవాదుల చేతుల్లో దారుణ హత్యకు గురైన సైనికుడు ఔరంగజేబు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ పరామర్శించారు. బుధవారం ఉదయం జమ్మూ కశ్మీర్‌లో ఔరంగజేబు స్వస్థలమైన పూంఛ్‌ వెళ్లిన ఆమె.. అమర జవాను కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందనీ… ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను త్వరలోనే పట్టుకుని న్యాయం చేస్తామని హావిూ ఇచ్చారు. వారిని వదిలిపెట్టబోమని అన్నారు. అలాగే భారత్‌ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలను అనుమతించబోమని అన్నారు. నిర్మలా సీతారామన్‌తో పాటు భారత ఆర్మీ, జమ్మూ కశ్మీర్‌ పోలీసు శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. జవాన్‌ కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేంద్రం వారికి అండగా ఉంటుందని అన్నారు. అతని త్యాగం దేశం మరవదని అన్నారు. కుటుంబంతో కలిసి రంజాన్‌ జరుపుకునేందుకు స్వస్థలానికి వెళుతున్న ఔరంగజేబును గతవారం ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి దారుణంగా పొట్టబెట్టుకున్న సంగతి తెలిసిందే. కరడుగట్టిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ తీవ్రవాది సవిూర్‌ టైగర్‌ను మట్టుబెట్టడంలో ఔరంగజేబు కీలక పాత్రపోషించాడు. ఆయన హత్యవెనుక పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్టు నిఘావర్గాలు భావిస్తున్నాయి. దీనిపైబాధ్యులమని ప్రకటించవద్దంటూ లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ వంటి ఉగ్రమూకలకు ఐఎస్‌ఐ ఆదేశించినట్టు చెబుతున్నారు. ఔరంగజేబు హత్యానంతరం జమ్మూ కశ్మీర్‌లో వెల్లువెత్తిన ఆగ్రహం, భారత ఆర్మీకి లభిస్తున్న మద్దతుపైనా ఐఎస్‌ఐ కన్నేసి ఉంచినట్టు సమాచారం.