కంచగచ్చిబౌలి భూములపై ప్రధాని అసత్యాలు మాట్లాడుతున్నారు

వివరాలు తెలుసుకోకుండా విమర్శలు సరికాదు
మండిపడ్డ ఎంపి చామల కిరణ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని మోదీ వాస్తవాలకు దూరంగా మాట్లాడారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఇక్కడి బిజెపి నేతలు ఇచ్చిన తపపుడు సమాచారంతో మాట్లాడడం సరికాదన్నారు. నిజాలు తెలుసుకుని ఉంటే ఇలా మాట్లాడేవారు కాదన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో అందరూ అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఫేక్‌ వీడియోలు సృష్టించిన వారిపై ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ వేయగానే.. అందరూ వాటిని డిలీట్‌ చేశారని తెలిపారు. హరియాణా ప్రజలను ప్రధాని మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీని దూషించాలని మోదీ ఈ విధంగా మాట్లాడుతున్నారు. తెలిసీ తెలియని సమాచారంతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అమలు చేస్తున్న పథకాలు విూ కార్యాలయం ద్వారా తెలుసుకొని మాట్లాడండి. సన్న బియ్యం, భూభారతి లాంటి మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. బీసీ ప్రధాని అంటారు కదా.. మరి బీసీ కులగణన విూద మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ఎంపి చామల ప్రశ్నించారు.