కంచ గచ్చిబౌలి భూములపై విచారణ చేపట్టాలి
` మోదీకి కేటీఆర్ విజ్ఞప్తి
` ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిదని వ్యాఖ్య
హైదరాబాద్(జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీకి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిదన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా ప్రధానిని ఆయన కోరారు. ‘’కంచ గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టాలి. కాంగ్రెస్, భాజపా కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. దీనిపై ప్రధాని వ్యాఖ్యలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలి. కంచ గచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రూ.10వేల కోట్ల ఆర్థిక మోసం. దీనిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా తెలిపాం. ఆర్థిక అవకతవకల అంశాన్ని కేంద్ర సాధికార కమిటీ నిర్ధరించింది. స్వతంత్ర విచారణ చేయాలని సూచించింది. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి’’ అని కేటీఆర్ కోరారు.
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో మహిళలకు పెద్దపీట
` ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న పార్టీ అధినేత కెసిఆర్
గజ్వెల్ (జనంసాక్షి):ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభలో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పార్టీ అధినేత కెసిఆర్ సూచించారు. మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలన్నారు. సభపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ మహిళా నేతలతో పాటు పలువురు నాయకులతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు-, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన తగిన సూచనలు చేస్తూ కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన వారిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హన్మకొండ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షులు, మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీష్ కుమార్, పార్టీ మహిళా నేతలు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఎస్‌పీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రా తనోబా, గిడ్డంగుల శాఖ మాజీ ఛైర్ పర్సన్ రజినీ సాయిచంద్, నవీన్ ఆచారి, పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.