కడెం ప్రాజక్టు భవిష్యత్‌పై ఆందోళనలు


ఆధునీకరణతోనే ముప్పు నివారణ
తక్షణ చర్యలు తీసుకోవాలంటున్న నిపుణులు
నిర్మల్‌,జూలై20(జ‌నంసాక్షి): ఎట్టకేలకు ప్రమాదం నుంచి కడెం ప్రాజెక్ట్‌ బయటపడగలిగింది. అయితే భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఎలా అన్న ఆందోళన సర్వత్రా మొదలైంది. ప్రభుత్వం సైతం కడెం ప్రాజెక్టుకు సంబందించి దిద్దుబాటు చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఉన్నతస్థాయి సాంకేతిక నిపుణుల బృందం కడెం ప్రాజెక్టును పరిశీలించింది. జిల్లా కలెక్టర్‌తో పాటు నలుగురు ఇంజనీరింగ్‌ నిపుణులు దాదాపు ఐదు గంటల పాటుగా ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే రిజర్వాయర్‌ను కూడా ఈ అధికారుల బృందం పరిశీలించింది. మరోరెండు, మూడురోజుల్లో నివేదిక తయారు చేసి ప్ర భుత్వానికి అందించనుంది. అయితే అధికారుల బృందం ప్రాజెక్టు నిర్మాణ లోపాలతో పాటు, నిర్వహణ లోపాలను సైతం గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులోపంతో లక్షల క్యూసెక్కుల నీరు గోదావరినదిలోకి వదిలేసే పరిస్థితి తలెత్తిందంటూ నిపుణుల బృందం అభిప్రాయపడినట్లు సమాచారం. కడెం ప్రాజెక్టును వెంటాడుతున్న సమస్యకు పరిష్కారం ఆధునికీకరణెళినని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న తొమ్మిది జర్మన్‌ తయారీగేట్లను ఆధునికీకరించడమే కాకుండా గేట్‌సాక్ట్‌ ఒకదానికొకటి కనెక్టింగ్‌ అయ్యే విధంగా చూడాలని భావిస్తున్నారు. అలాగే గేట్లు ఎత్తే మిషన్‌లలో బేరింగ్‌లను మార్చాలని కూడా సూచించనున్నారు. గేట్ల ఎత్తును పెంచడమే కాకుండా మరో ఎనిమిది గేట్లను అద నంగా ఏర్పాటు చేయాలన్న సిఫారసులు కూడా తెరపైకి వచ్చాయని అంటున్నారు. దీంతో పాటు ఎగువ నుంచి వచ్చే వరదలెక్కలపై కూడా స్పష్టత వచ్చే విధంగా ఓ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్లడ్‌ మా నిటరింగ్‌ సిస్టం అమలు కావాలని ప్రస్తుతం వర్షపాతం ఆధారంగానే వరదను లెక్కిస్తుండడంతో ఉదృతిని తెలుసుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణుల బృందం భావిస్తోంది. ఇప్పటికే పలువురు ఇంజనీరింగ్‌ నిపుణులు సైతం కడెం ప్రాజెక్టు ఆధునికీకరణను
చేపట్టాలంటూ సర్కారుకు సిఫారసులు చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా దృష్టి కేంద్రీకరించలేదు.
ఇదిలా ఉండగా కడెం ప్రాజెక్టు ఆధునికీకరణ, మరమత్తులకు సంబంధించి సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ప్రత్యేక ప్రణాళికను రూపొందించనున్నట్లు సమాచారం. ఈ మేరకు నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌కు ఈ నివేదికలను అందించనుంది.