కదం తొక్కిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ
జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిన హుజూర్ నగర్
– ఆద్యంతం జాతీయ సమైక్యత, సమగ్రతతో ఉర్రుతలూగిన ర్యాలీ
– జాతీయజెండాలు చేతబూని కదం తొక్కిన తెలంగాణ సమాజం
హుజూర్ నగర్ సెప్టెంబర్ 16 (జనం సాక్షి): తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవం సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం వజ్రోత్సవ ర్యాలీని జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ముందుకు సాగుతూ తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూల మలవేసి అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర వచ్చేనాటికి ఉన్న 500 పై చిలుకు సంస్థానాలల్లో హైదరాబాద్ ఒకటి అని అప్పటికే ఈ రాష్ట్రానికి ప్రత్యక కరెన్సీ, సైన్యం, ఎయిర్ పోర్ట్, విద్యుత్ కలిగిన సంస్థానం అని తెలిపారు. నిజాం స్వతంత్రంగా పరిపాలిస్తానని తెలియజేసి చివరికి భారత ప్రభుత్వానికి లొంగిపోయి భారతదేశంలో హైదరాబాద్ ని కలిపివేశారని తెలియజేశారు. 2014 నాటికి అట్టడుగున ఉన్న తెలంగాణ నేడు దేశానికి ఆదర్శంగా ఎదిగినది అని తెలియజేశారు. తెలంగాణా ప్రత్యక రాష్ట్రం కోసం జరిగిన దశల వారి ఉద్యమంలో భాగంగా మలి దశ ఉద్యమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మాత్రమే దక్కుతుందన్నారు. ఎన్నో కుట్రలని, అవమానాలని దాటుకుని నేడు తెలంగాణ ప్రత్యేక రాష్టం తేవడం మాత్రమే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణలోని ప్రతి కుటుంబాల్లో ప్రతి పౌరుడు ఏదో ఒక రకమైన సంక్షేమ పథకం ద్వారా తన ఇబ్బందులను పోగొట్టుకొని సుఖ శాంతంగా జీవించడానికి తమ జీవితాలను సిఎం కెసిఆర్ సుగమనం చేశారన్నారు. తెలంగాణ సమాజం మొదటి నుంచి కూడా గంగా, జమున, తహసీబ్ గా వర్ధిల్లుతూ కులాలు, మతాలు అని వివక్షత లేకుండా బంధుత్వంతో, సోదర భావంతో తెలంగాణ సమాజం శాంతియుతంగా జీవిస్తున్న సందర్భంగా శాంతియుత జీవనం ఇలాగే కొనసాగాలని అందులో భాగంగానే నేడు సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ దినంగా అభివర్ణిస్తూ జాతీయత ఉట్టిపడేలా ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్రం తో పాటు హుజూర్ నగర్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధిలో పరుగులు పెడితే శరవేగంగా ముందుకు దూసుకుపోతుంది ఇప్పటికే 3500 కోట్ల రూపాయలతో నియోజకవర్గ మొత్తంలో రోడ్లు, భవనాలు, కాలువలు, వంతెనలు, రహదారులు మొదలైన మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో, మినీ ట్యాంక్ బండ్లు, చిల్డ్రన్స్ పార్కులు, సిసి రోడ్డు, డ్రైనేజీలు ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులను రూపొందించుకుంటూ ప్రతి గ్రామాన్ని ఒక అద్దంలో తయారు చేసుకుంటూ గత 25 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని కేవలం ఈ రెండున్నర సంవత్సరాలలో జరిపి ప్రత్యక్షంగా ప్రజలకు చూపించడం జరుగుతుంది అని అన్నారు. యువతకు ప్రతినిత్యం పుస్తకాలతో స్నేహాలు చేయాలని, పుస్తకాలు చదవాలని మంచిని స్వీకరించాలి సమాజంలో ఎన్నో రకాలైనటువంటి మంచి, చెడు ప్రభావాలు ప్రతినిత్యం సంఘర్షణంగా కనిపిస్తూ ఉంటాయని అటువంటి సందర్భాలలో మంచిని మాత్రమే స్వీకరించి సమాజ అభ్యుదయానికి పాటుపడాలని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారికి సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఆర్ డి ఓ వేంకారెడ్డి, సి ఐ రామలింగారెడ్డి, తహసిల్దార్ వజ్రాల జయశ్రీ, ఎస్సై వెంకట్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, వివిధ మండలాల అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.