కదిలిన ఢిల్లీ
‘తెలంగాణ సమస్యపై నెలరోజుల్లో తేల్చేస్తాం’ గత నెల 28న ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తింపు పొందిన పార్టీలతో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన ప్రకటన అది. షిండే కేవలం ప్రకటన చేసి చేతులు దులుపుకోలేదని, ఈ సమస్యకు ఏదో ఒక ముగింపు ఇచ్చే దిశగా యూపీఏ-2 ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇందుకు గురువారం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశమే ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ తమకు కీలకమైన రాష్ట్రమని ఆ పార్టీ అధికార ప్రతినిధి రషీద్‌అల్వీ ప్రకటన చేసిన మరుసటి రోజే కీలక నేతల భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణవాదాన్ని, ఇతర ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్‌ను ఒకేఘాటన కట్టలేమని, అలాచేస్తే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అల్వీ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇంతకుముందెప్పుడూ ఏఐసీసీ పక్షాన ఇలాంటి సుదీర్ఘ ప్రకటనలుగాని, వివరణలుగాని ఇచ్చిన సందర్భాలేవి లేవు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినా సీమాంధ్ర ప్రాంత నేతలు, పోటీ ఉద్యమానికి తలొగ్గి 12 రోజుల తర్వాత మరో ప్రకటన చేసి తెలంగాణ అంశాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టారు. దీనిని నిరసిస్తూ సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసినా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. 2014 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంతకాలం కోల్డ్‌స్టోరేజీలో పెట్టిన తెలంగాణను కాంగ్రెస్ అధిష్టానం వెలికి తీసుకుంది. రాహుల్‌బాబుకు పట్టాభిషేకం చేయడమే లక్ష్యంగా ఎన్నికలకు సమాయత్తమవుతున్న ఆ పార్టీ పెద్దలు రెండు పర్యాయాలు యూపీఏ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్‌ను నిర్లక్ష్యం చేయదల్చుకోలేదు. ఇక్కడ పార్టీ గెలుపునకు అడ్డంకిగా ఉన్న తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలని ఆ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే అఖిలపక్షం నిర్వహించి రాష్ట్రంలోని అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంది. అంతటితో ఆగకుండా నెలలోపు పరిష్కారం చూపనున్నట్లుగా బహిరంగ ప్రకటన చేసింది. దానికి కొనసాగింపుగా ఏఐసీసీ పక్షాన తెలంగాణకు అనుకూల ప్రకటనలే వెలువడుతున్నాయి. ఇందులో భాగంగానే సోనియాగాంధీ హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనభీ ఆజాద్, కేంద్ర మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనితో భేటీ అయ్యారు. ఢిల్లీ అత్యాచార బాధితురాలి మృతి తర్వాత పరిస్థితులు, తెలంగాణ అంశంపై మాత్రమే సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాదు సోమవారం విజయవాడలో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ సదస్సును వాయిదా వేసుకోవాలని అధిష్టానం సూచించింది. ఈమేరకు గులాంనభీ ఆజాద్ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ఫోన్ చేసి ప్రాంతీయ సదస్సులు నిర్వహించొద్దని ఆదేశించారు. అంటే తెలంగాణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోంచి మరో ఉమ్మడి వేదిక గొంతు విప్పడం అధిష్టానానికి ఇష్టం లేదు అనుకోవాలి. అధిష్టానానికి ఆ ఉద్దేశమే లేకుంటే ప్రాంతీయ సదస్సు నిర్వహించవద్దని చెప్పదు. 2009 డిసెంబర్ 10 నాటి పరిస్థితులు పునరావృత్తం అవడం ఏఐసీసీ పెద్దలకు ఇష్టం లేదు. ఒకరిద్దరు సమైక్యాంధ్ర అంటూ మీడియా ముందు మాట్లాడినా వారిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే తరహాలో అధిష్టానం ముందకెళ్తోంది. ఇంతకాలం నాన్చుతూ వచ్చి సమస్యను తేల్చిగాని మరో పనికి వెళ్లకూడదనేది కాంగ్రెస్ పెద్దల అభిమతం. ఈక్రమంలోనే పార్టీ పెద్దలు అభివృద్ధి మండలి, ప్యాకేజీలంటూ మీడియాకు లీసులిస్తూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నమూ చేస్తున్నారు. తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్నా తాము వ్యతిరేకించబోమని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు మంత్రులు, పార్టీ ముఖ్యులు చెప్తున్నారంటే ఇక తెలంగాణపై నిర్ణయం తీసుకోవడమే తరువాయి అన్నట్లుగా తెలుస్తోంది.