కనేరియాపై జీవితకాల నిషేధం

లా¬ర్‌,జూలై 5 (జనంసాక్షి):

పాకిస్థాన్‌ లెగ్‌స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా క్రికెట్‌ కెరీర్‌ ముగిసింది. స్పాట్‌ఫిక్సింగ్‌ ఆరోపణల్లో చిక్కుకున్న ఈ క్రికెటర్‌పై జీవితకాల నిషేధం విధిస్తున్నట్టు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ ప్రకటించింది. ఇటీవల ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు అతనిపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు నిరాకరించడంతో పిసిబి ఈ నిర్ణయం తీసుకుంది. 2009 ఇంగ్లీష్‌ కౌంటీ సీజన్‌లో కనేరియా ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉధ్ధేశపూర్వకంగా మ్యాచ్‌ ఓడిపోయేందుకు బుకీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అతని సహచరుడు వెస్ట్‌ఫీల్డ్‌ చెప్పడంతో ఈసీబీ కనేరియాపై నిషేధం వేటు వేసింది. దీనిపై పలుసార్లు అప్పీల్‌ చేసుకున్నప్పటకీ ఫలితం లేకపోయింది. నిషేధం ఎత్తివేయకూడదని ఈసిబి తీసుకున్న నిర్ణయానికి మధ్ధతుగా తాము కూడా లైఫ్‌ బ్యాన్‌ చేస్తున్నట్టు పాక్‌ బోర్డు తెలిపింది. దీని ప్రకారం కనేరియా క్రికెట్‌తో పాటు క్రికెట్‌ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా వీలులేదు. అలాగే పిసిబితో అనుబంధమున్న ఏ అసోసియేషన్‌ అడ్మినిస్టేష్రన్‌లోనూ అతను పనిచేసేందుకు కూడా కుదరదు. ఐసిసి నిబంధనలు అనుసరించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పిసిబి వెల్లడించింది.