కన్నడనాట హంగ్‌

– మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోని పార్టీలు
– కింగ్‌మేకర్‌గా అవతరించిన జేడీఎస్‌
– హంగ్‌తో బీజేపీకి షాక్‌ఇచ్చిన కాంగ్రెస్‌
– జేడీఎస్‌కు బయటనుండి మద్దతు
– దేవెగౌడతో ఫోన్‌లో మాట్లాడిన సోనియా
– కుమారస్వామికి సీఎం పదవికి ఓకే
– అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ
– కీలకంగా మారిన గవర్నర్‌ నిర్ణయం
– గవర్నర్‌ ఓకే చెబితే ముఖ్యమంత్రిగా కుమారస్వామి
– సిఎం పదవికి సిద్ధిరామయ్య రాజీనామా
– చక్రంతిప్పుతామంటున్న బీజేపీ
– జేడీఎస్‌నుంచి చీలక పెట్టేలా బీజేపీ నేతల అడుగులు?
బెంగళూరు, మే15(జ‌నం సాక్షి ) : ఉత్కంఠభరితంగా సాగిన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో చివరికి హంగ్‌ ఏర్పడింది.. కన్నడ ప్రజలు ఏ ఒక్క పార్టీకి మ్యాజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన మెజార్టీని ఇవ్వలేదు.. దీంతో హంగ్‌ అనివార్యమైంది.. హంగ్‌ ఏర్పడంతో మూడవ స్థానంలో నిలిచిన జేడీఎస్‌ ఒక్కసారిగా కింగ్‌మేకర్‌గా మారింది. మొత్తం122 స్థానాలుకు ఎన్నికలు జరిగగా బీజేపీ(104సీట్లు) అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌(78), జేడీఎస్‌(38), ఇతరులు(2) స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో  బీజేపీకి గానీ, కాంగ్రెస్‌ కు గానీ జేడీఎస్‌ మద్దతు కోరాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది.
జేడీఎస్‌కు లక్కీచాన్స్‌..
గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌ నేతలు ముందే మేల్కొంది. కన్నడనాడ పెద్దపార్టీగా అవతరించిన బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని ఇవ్వకూడదని భావించిన కాంగ్రెస్‌ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. ఢిల్లీ నుంచే జేడీఎస్‌తో మంతనాలను కొనసాగించింది. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చకచకా వ్యూహాలు అమలుచేసింది. కర్ణాటకలోనే పాగా వేసిన గులాంనబీ ఆజాద్‌ జేడీఎస్‌ నేతలతో మంతనాలు చేశారు. ఏ చిన్న అవకాశం ఒదులుకున్నా బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేసేలా పావులు కదుపుతుండటంతో ఏకంగా జేడీఎస్‌కే సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియా గాంధీనే జేడీఎస్‌ కురువృద్ధుడు దేవేగౌడకు ఫోన్‌చేసి కలిసిపనిచేద్దామని కోరారు. తాము బయట నుంచి మద్దతు ఇస్తామని.. విూరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి కోరారు.. ఇందుకు గౌడ కూడా సుముఖత వ్యక్తం చేసినప్పికీ బయట నుండి కాకుండా ప్రభుత్వంలో చేరాలని కాంగ్రెస్‌కు షరతు విధించారు. దీంతో సోనియాగాంధీ ఆలోచిస్తామని.. ముందు విూరు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంకండి అని సూచించారు. అనంతరం సిద్ధిరామయ్య, గులాంనబీ ఆజాద్‌లతో పాటు పలువురు నేతలు విూడియాతో మాట్లాడారు. తాము కాంగ్రెస్‌కు బయటి నుండి మద్దతు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ మధ్య చర్చలు సఫలీకృతమయ్యాయని, జేడీఎస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని సూచించినా తాము మద్దతిస్తామని తేల్చి చెప్పారు. దీంతో దేవగౌడ్‌ నివాసానికి చేరుకున్న వారు కొద్దిసేపు చర్చలు జరిపారు. అనంతరం ఇరుపార్టీల
నేతలు కలిసి మంగళవారం సాయంత్రమే గవర్నర్‌ను కలిశారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, తమకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. జేడీఎస్‌ కీలక నేత, దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణతో బీజేపీ నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. తనతో పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. మద్దతు ఇచ్చేందుకు తాను సిద్ధమని బీజేపీకి రేవణ్ణ భరోసా ఇచ్చినట్టు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే… కన్నడ నాట బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
గవర్నర్‌ విజుభాయ్‌ ఏం చేస్తారో?..
హంగ్‌ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలనేదానిపై కర్ణాటక గవర్నర్‌ విజుభాయ్‌ రుడాభాయ్‌ వాలా నిర్ణయం కీలకంగా మారింది. గుజరాత్‌కు చెందిన విజుభాయ్‌.. బీజేపీ ఎమ్మెల్యేగా బహుకాలం సేవలందించారు. 2014లో కేంద్రం ఆయనను కర్ణాటక గవర్నర్‌గా పంపింది. సాధారణంగా అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం రివాజుగా వస్తున్నప్పటికీ.. ఆ సంఖ్య కంటే ‘కాంగ్రెస్‌-జేడీఎస్‌’ కూటమి స్థానాలు ఎక్కువ కావడంతో గవర్నర్‌ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, తాము పెద్ద పార్టీగా ఏర్పడిన పక్షంలో.. ఒకవేళ గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహా ప్రకటన చేస్తే ఏమినటే ప్రశ్న ఉత్పన్నంకాకమానదు.
ఫలితాల తారుమారుతో విూడియా సమావేశాలు రద్దు..
ఫలితాల ట్రెండ్స్‌ తొలి దశలో బీజేపీ గెలుస్తోందన్నట్లు రావడంతో ఆ పార్టీ కార్యాలయాల్లో సందడివాతావరణం కనిపించింది. తీరా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడేటప్పటికి సీన్‌ రివర్స్‌ అయింది. దీంతో విూడియా సమావేశం నిర్వహించాలనుకున్న బీజేపీ పెద్దలు.. అనూహ్యంగా దానిని రద్దుచేసుకున్నారు. ఫలితాలపై స్పందించేందుకు కాంగ్రెస్‌ కూడా విూడియా సమావేశాన్ని నిర్వహించాలనుకుంది. కానీ పొత్తుకు జేడీఎస్‌ అంగీకరించడంతో చివరినిమిషంలో ప్రెస్‌విూట్‌ రద్దుచేసుకుంది. ఇదిలా ఉంటే సీఎంగా కొనసాగుతున్న సిద్ధిరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసిన ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందించారు.