కన్నడనాడి తెలిసేది రేపే

 

కౌంటింగ్‌కు భారీ ఏర్పాట్లు

ఉదయం 8గంటల నుంచి లెక్కింపు

మధ్యాహ్నం కల్లా ఫలితాల వెల్లడి

ఊహాల్లో విహరిస్తున్న నేతలు

బెంగళూరు,మే14(జ‌నంసాక్షి): కర్ణాటక ఎన్నికలకు సంబంధించి మంగళవారం కౌంటింగ్‌కు భారీ ఏర్పాట్లు చేశారు. ఫలితాల కోసం దేశం ఉత్కంఠంగా ఎదరుచూస్తోంది. ఎవరు విజయం సాధిస్తారా అన్నది మంగళవారం తేలనుంచి కర్నాటకలో మరోమారు కాంగ్రెస్‌ గెలుస్తుందా లేక దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బిజెపి కన్నడ నాడిని పట్టిందా అన్నది కూడా తేలనుంది. ఇకపోతే జెడిఎస్‌ కూడా ఇందులో కీలకభూమిక పోషించబోతున్నది. అయితే అధికారాన్ని అందుకోవాలన్న ఆతృత నేతలను పరుగులు పెట్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్‌ నేపథ్యంలో నేతల్లో ఉత్కంఠ నరాలు తెగేలా చేస్తోంది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినన్ని స్థానాల్ని కాంగ్రెస్‌ గెలుచుకోలేని పక్షంలో.. అధికారంలోకి రావాలని కలలు కంటున్న భారతీయ జనతాపార్టీకి ప్రజలు తగినన్ని స్థానాల్ని కట్టపెట్టని పరిస్థితిలో.. అధికార పగ్గాలు తనకేనని గాంభీర్యతను ప్రదర్శిస్తున్న జనతాదళ్‌కు పాలనా పగ్గాలు దక్కుతాయా? ఆ స్థాయిలో సీట్లు దక్కని పక్షంలో.. కింగ్‌ మేకర్‌గా ప్రకటిస్తున్న దళపతుల పయనమెటు? రాజకీయ విశ్లేషకులను పీడిస్తున్న ప్రశ్నలు ఇవే. రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారంతా తలలు పట్టుక్కూర్చున్న సందేహాలకు దళపతులే ఊతమిస్తున్నారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు మెజారిటీరాని పక్షంలో జనతాదళ్‌ పార్టీ చక్రం తిప్పనుంది. ఆ పార్టీ మద్దతు లేకుండా ఏఒక్కరికీ అధికారాన్ని చేపట్టే అవకాశాలుండవు. 224 స్థానాలున్న అసెంబ్లీకి 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండేసి స్థానాల్లో పోటీచేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఎంపీ బి.శ్రీరాములు ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిందే. శ్రీరాములు విషయమైతే ఆయన లోక్‌సభ స్థానాన్ని అట్టిపెట్టుకునే పక్షంలో రెండు అసెంబ్లీ స్థానాలకూ రాజీనామా చేయాల్సిన అనివార్యం ఎదురవుతుంది. ఆ విధంగా చూసినా రెండు మూడు స్థానాలు ఖాళీ కావడం ఖాయం. అదే జరిగితే ఓట్ల లెక్కింపులో 110 స్థానాల్ని గెలుచుకునే పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోగలిగితే.. ఇప్పుడీ ప్రశ్నే రెండు పార్టీలనూ పీడిస్తోంది. వివిధ పత్రికా సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌లో జనతాదళ్‌ పార్టీకి 25- 30 స్థానాలకు నించి వచ్చే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఇదే

జరిగితే ఎదో ఒక పార్టీకి మద్దతునివ్వాల్సిన పరిస్థితితో పాటు తాను చెప్పిన వ్యక్తినే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టే అవకాశం ఆ పార్టీ సొంతం కానుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దళిత ముఖ్యమంత్రి అంశాన్ని హఠాత్తుగా తెరవిూదకు తీసుకురావడం వెనుక నిగూఢ రాజకీయం చోటుచేసుకుందనేది విశ్లేషకుల భావన. మెజారిటీకి తగినన్ని స్థానాల్ని కాంగ్రెస్‌ పార్టీ సాధించుకోలేని పరిస్థితుల్లో జనతాదళ్‌ మద్దతును పొందేందుకు ముందుగానే ఈ కార్డును విసిరారని చెబుతున్నారు. బహుజన సమాజ్‌ పార్టీతో ఎన్నికల పొత్తుపెట్టుకున్న కుమారస్వామి- దళిత నేతను ముఖ్యమంత్రి చేసేందుకు కాంగ్రెస్‌ విసిరిన బాణం నుంచి తప్పించుకునేందుకు వీలుకాదు. ఈ ప్రతిపాదనను కాదని భారతీయ జనతాపార్టీకి మద్దతునిచ్చే పక్షంలో సమాజంలో ఒక బలమైన వర్గానికి శాశ్వతంగా దూరం కావడం ఖాయం. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతాపార్టీ దళిత నేతను సీఎం చేసే అవకాశాల్లేవు. ఇక మిగిలింది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. కొత్త నినాదాన్ని తెరవిూదకు తీసుకొచ్చి- దళ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అడ్డుకట్ట వేసినట్లు కాంగ్రెస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు గానూ 222 స్థానాలకు గత శనివారం ఎన్నికలు జరిగాయి. బిజెపి అభ్యర్థి విజయకుమార్‌ మృతిచెందడంతో జయనగర్‌లో, నకిలీ ఓటు కార్డుల వివాదం కారణంగా రాజరాజేశ్వరి నగర్‌లో ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈనెల 28న పోలింగ్‌ జరగనుందని ఎన్నికల ప్రధానాధికారి పేర్కొన్నారు. ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ హంగ్‌ అసెంబ్లీ తప్పదని వెల్లడించాయి. అయితే కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు రాగలవని కూడా అంటున్నారు. మరోవైపు ఈ నెల 15న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. సిబ్బందికి ఇప్పటికే శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రతి క్షేత్రం ఓట్ల లెక్కింపునకు ఒక్కో గది కేటాయించారు. అందులో 14 బల్లలు ఉంటాయి. ఒక్కొక్క బల్ల వద్ద ప్రతి పార్టీ నుంచి ఓ ఏజెంట్‌, ముగ్గురు సిబ్బంది ఉంటారు. 14 నుంచి 18 రౌండ్లలో లెక్కింపు చేపడతారు. ఈవీఎం యంత్రాలు, వి.వి.ప్యాట్‌లోని ఓట్లను కూడా లెక్కిస్తారని అధికారి తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ను కూడా అక్కడే లెక్కిస్తారు. వీటిని లెక్కించడం పూర్తయ్యాక చివరి రౌండ్‌ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామన్నారు. లెక్కింపు కేంద్రాల్లో వెబ్‌ కెమేరాలను ఉపయోగిస్తున్నారు. సిబ్బంది 15న ఉదయం 5 గంటలకు తమకు కేటాయించిన బల్లల వద్దకు చేరుకోవాలి. 7 గంటలకు స్ట్రాంగ్‌ రూంను పోలీస్‌ సిబ్బంది, అధికారులు, పార్టీ నేతల సమక్షంలో తెరుస్తాం. 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ఇకపోతే మే 12న జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ఈవిఎంలలో సాంకేతిక లోపాల కారణంగా హెబ్బాళలోని లట్టగొల్లహళ్లి, కొప్పళ్లలోని కుష్టగిలో రీపోలింగ్‌ సోమవారం ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్‌ సాయంత్రం 6గంటల వరకూ కొనసాగనుంది. దీనిపై ఎన్నికల ప్రధానాధికారి సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ పోలింగ్‌ బూత్‌ నెంబర్‌20, 21కేంద్రాలను రీపోలింగ్‌కు ఏర్పాటు చేశామని, అయితే 21వ నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేయాల్సిన 275మంది పేర్లు 20వ నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఉండటంతో వారందరినీ అక్కడకి పంపించామని తెలిపారు.