కరీంనగర్‌లో వేడెక్కిన ప్రచారం
టిక్కెట్ హావిూ రాకున్న ప్రచారం వదలని శోభ
కరీంనగర్,అక్టోబర్23(జనంసాక్షి): కరీంనగర్‌లో సందడి జోరందుకుంది. మంత్రి ఈటెల రాజేందురు ప్రచారంలో దేసుకుని పోతున్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఎక్కడిక్కడ ప్రచారంలో ముందున్నారు. కెటిఆర్ కూడా ప్రచారంలో స్పీడు పెంచారు. టిఆర్‌ఎస్ పాత అభ్యర్థులనే రంగంలోకి దించింది. చొప్పదండిపై మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నది. అయినా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు. అధినేత కెసిఆర్ మళ్లీ అనుగ్రహిస్తారన్న ఆశలో ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సందడి జోరందుకుంది. అభ్యర్థుల ప్రచారంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. టీఆర్‌ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్‌లోని 13 నియోజకవర్గాలకు 12 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. చొప్పదండిలో సైతం నేడో రేపో ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. 13 స్థానాలకు కాంగ్రెస్ పార్టీకి భారీగానే దరఖాస్తులు అందినప్పటికీ, కూటమిలో భాగంగా అభ్యర్థుల ప్రకటనపై తాత్సారం జరుగుతోంది. అమిత్ షా పర్యటన తరవాత బిజెపిలో కూడ ఆజోరు కనిపిస్తోంది. ఓ వైపు టిక్కెట్లు ఖరారైన అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నం కాగా, పొత్తులు, సీట్ల సర్దుబాటు కోసం కొందరు రాజధాని చుట్టూ చక్కర్లు కొడుతుండగా, ప్రస్తుతం జిల్లాలో రాజకీయ పార్టీలు మా/-తరం ప్రచారంలో ముందున్నారు. మహాకూటమిగా జతకట్టే పార్టీల్లో సర్దుబాటు విషయంలో ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కేడర్‌లో తర్జనభర్జన నానాటికీ పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినా.. పొత్తుల విషయంలో స్పష్టత లేని కారణంగా పీటముడి వీడటం లేదు. ఆయా స్థానాల్లో బరిలో నిలిచే నాయకులెవరనేది ఇంకా తేలక అయోమయ పరిస్థితి నెలకొంది. మొత్తం 13 స్థానాల్లో ఎనిమిది, తొమ్మిది స్థానాలు కూటమి సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్‌కు దక్కే వీలుంది. జగిత్యాల, మంథని మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పొత్తుల్లో భాగంగా కనీసం రెం డు స్థానాలన్నా ఇవ్వాలంటున్నట్లు ప్రచారం. ఇదే సమయంలో తెలంగాణ జన సమితి సైతం మరో మూడు స్థానాలపై గురి పెట్టింది. సీపీఐ మాత్రం హుస్నాబాద్ సీటు తప్పనిసరి అంటుండటంతో జిల్లాలో రెండో సీటు ప్రస్తావన లేనట్లే. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కరీంనగర్‌లో హుజూరాబాద్, కోరుట్ల తెదేపా స్థానాలను అడుగుతోంది. ఉమ్మడి జిల్లాలో హుజూరాబాద్, కరీంనగర్, రామగుండం స్థానాల ను టిజెఎస్ పార్టీ కోరుతోంది. రాజకీయ కంచుకోటైన ఉమ్మడి కరీంనగర్‌లోని ఒక్క స్థానం నుంచైనా బరిలో నిలవాలనే ప్రయత్నాల్ని సీపీఐ చేపడుతోంది. పట్టున్న స్థానం కోసం కూటమి ముంగిట ప్రతిపాదనల్ని పెట్టినట్లు సమాచారం. పొత్తులు తేలక కూటమి భాగస్వామ్య పార్టీలు ఏవిూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాయి.