కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న బంద్
కరీంనగర్: సిరిసిల్లలో వైఎస్ విజయమ్మ దీక్ష సందర్భంగా విద్యార్థులు, మహిళలపై అక్రమంగా దాడులు నిర్వహించి అరెస్టు చేసినందుకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా కార్మిక సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ రూవ్‌సింగ్ ఆధ్వర్యంలో కార్మికులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా గోదావరిఖనిలో తెలంగాణ వాదులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించిన నాయకులు డిపో ప్రధాన గేటుకు తాళం వేశారు. జిల్లాలోని సిరిసిల్ల, హుజూరాబాద్ తదితర ప్రాంతాల్లో బంద్ కొనసాగుతోంది.