కరీంనగర్ జిల్లాలో.. పరువు హత్య?
– కుమార్ అనే యువకుడిని అనుమానాస్పద మృతి
– ప్రియురాలి కుటుంబీకులే హత్య చేశారంటూ బంధువుల ఆందోళన
కరీంనగర్, అక్టోబర్9(జనంసాక్షి) : కరీంనగర్ జిల్లాలో యువకుడి మృతి కలకలంరేపింది. శంకరపట్నం మండలం తాడికల్‌కు చెందిన గడ్డి కుమార్ అనుమానాస్పద రీతిలో తాడికల్ శివారులోని పొలాల్లో శవమై కనిపించాడు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అతడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రేమ వ్యవహారం వల్లే ఇలా జరిగిందని.. కుమార్‌ది ముమ్మాటికీ హత్యేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతడు ప్రేమించిన యువతి తరపు బంధువులే హతమార్చారంటున్నారు. కుమార్ హత్యకు నిరసనగా బంధువులు, స్థానికులంతా నిరసనకు దిగారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసుల్ని అడ్డుకున్నారు. పోలీసులు వాహనంపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. కుమార్ మరణానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. కరీంనగర్-వరంగల్ హైవేపై బైఠాయించడంతో.. ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. పోలీసులు స్థానికులకు సర్థి చెప్పాలని చూసిన శాంతించకపోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కుమార్ కొద్ది రోజులుగా ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలిసి.. ఆమె బంధువులు కుమార్‌ను కొద్ది రోజుల క్రితమే హెచ్చరించినట్లు తెలుస్తోంది. యువతిని మర్చిపోవాలంటూ బెదిరించినట్లు చెబుతున్నారు. అయినా కుమార్ యువతిని కలుస్తుండేవాడని.. ఆ కోపంతోనే అతడ్ని హతమార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే తాడికల్‌లో యువకుడిది పరువు హత్య కాదని, అది ఆత్మహత్యేనని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. కుమార్ మైనర్ బాలికను ప్రేమపేరుతో తీసుకెళ్లాడని అన్నారు. ఇప్పటికే కేసు నమోదైందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.