కరోనా ఉధృతి తగ్గింది
– పాజిటివ్ కేసులు 3.8 శాతమే
– ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస్
హైదరాబాద్,నవంబరు 21(జనంసాక్షి):తెలంగాణలో నవంబరు నెలలో చాలా తక్కువ కేసులు నమోదవుతున్నట్లు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస్ వెల్లడించారు. ఈ వారంలో అత్యంత తక్కువ కేసులు నమోదయ్యాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 లక్షలకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపారు. గత నాలుగు నెలలుగా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచడంతోపాటు, ప్రభుత్వం తీసుకున్న నివారణ చర్యల వల్ల రాష్ట్రంలో కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 1,12,892 కేసులు నమోదయ్యాయని, నవంబరు నెలలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల రేటు 3.8 శాతంగా ఉందని తెలిపారు. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోనే తక్కువ కేసులు ఉన్నట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.దేశంలో మొట్టమొదటి సారి లాక్‌డౌన్ తెలంగాణలోనే అమలు చేశామని శ్రీనివాస్ అన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ చేసి ప్రజలకు నిత్యావసరాలు అందించామన్నారు. పండుగల సమయంలో కాస్త ఆందోళన చెందినప్పటికీ కేసుల సంఖ్య పెరగకపోవడం సంతోషకరమన్నారు. మరో రెండు మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని శ్రీనివాస్ తెలిపారు. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా నిర్ధారణ పరీక్షలను కూడా పెంచాలని నిర్ణయించినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు జిల్లాల అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఒక్కోరోజులో 65 వేల వరకు నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.అన్ని ప్రైవేటు వైద్య కళాశాల ల్యాబ్‌లలో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలకు అనుమతులు వచ్చాయని చెప్పారు.ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్ష ధరలు తగ్గించామని, నూతన ధరలు అమలు చేయనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ హెచ్చరించారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులను తక్కువ ధరకు చేస్తున్నామని అన్నారు. కిట్ ఖర్చు కేవలం రూ.250 మాత్రమే పడుతుందని, ర్యాపిడ్ పరీక్షలు చేసేందుకు ప్రైవేట్ ల్యాబ్‌లు, హాస్పిటల్స్ ముందుకు వస్తే అనుమతి ఇస్తామని శ్రీనివాస్ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కార్యకర్తలు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించేలా నేతలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అదుపులో వైరస్ :రమేశ్‌రెడ్డి
కరోనా మహమ్మారితో దేశ రాజధాని దిల్లీ దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోందని డీఎంఈ రమేశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో మాత్రం వైరస్ అదుపులో ఉందని చెప్పారు. ప్రజల జాగ్రత్తల వల్లే కేసులు తగ్గుముఖం పట్టాయని, సెకెండ్ వేవ్ వచ్చినా సన్నద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక హెల్త్‌కేర్ వర్కర్స్‌కి తొలి విడతగా ఇస్తామన్నారు.