కరోనా వేళ భారీ పెరిగిన మందుల ధరలు
30నుంచి 40 శాతం వరకు ఔషధాలపై వడ్డింపు
పెరిగిన ధరలను పట్టించుకోని ప్రభుత్వాలు
న్యూఢిల్లీ,అక్టోబర్21( జనం సాక్షి): కరోనా స్వారీ చేస్తున్న వేళ ప్రజలు సొంత వైద్యానికి అలవాటు పడ్డారు. విటమిన్లు, జలుబు దగ్గు మందులు సొంతగా వాడుతున్నారు. ప్యారాసిటమల్ సహా అనేక మందులను తమకు తోచిన విధంగా వినియోగిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా మెడికల్ షాపుల్లో అనేకానేక మందులు దర్శనమిస్తున్నాయి. మెడికల్ షాపుల వారే ఫలానా మందులు వేసుకోమని సలహాలు ఇస్తున్నారు. తుమ్మినా దగ్గినా మెడికల్ షాపుకు పరుగెత్తే కాలం వచ్చింది. మొత్తంగా గత ఆరు నెలల కింది పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ..వివిధ రకాల మందులు, టానిక్‌ల ధరలు విపరీతంగా పెరిగాయి. కనీసం 30నుంచి 40శాతం ధరలు పెంచేసారు. దీన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జనరిక్ ఔషధాలను అందుబాటులోకి తేవడం, మందుల పేర్లను స్పష్టంగా రాయడం వంటి ఆదేశాలు ఉన్నా అవి అమలు కావడం లేదు. గ్రామాల్లో అసలు ఈవిషయాలు తెలియక పోవడంతో అమాయకులు దోపిడీకి గురవుతున్నారు. జెనరిక్ మందులను ప్రోత్సహిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో ఇచ్చిన హావిూ
మేరకు ఎంసీఐ ఆదేశాలను జారీ చేసినా జనరిక్ షాపుల ఏర్పాటు జరగడం లేదు. జనరిక్ మందులు అందుబాటులోకి వస్తే దాదాపుగా రోగికి సగం ఖర్చుల భారం తగ్గుతంది. కానీ ఆ దిశగా ప్రయాత్నాలు సాగడం లేదు. కనీసం ప్రభుత్వ ఆస్పత్రులకు అనుబంధంగా వీటిని అందుబాటులోకి తీసుకుని రావాలి. వైద్యులు వీటినే రాసేలా కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలకు నష్టం తప్పేలా లేదు. అలాగే ప్రైవేట్ వైద్యులపై కఠిన చర్యలు కూడా ఉండాలి. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పెద్ద ఔషధ సంస్థలు వారి ఉత్పాదనలకు ఆకర్షణీయమైన పేర్లు పెట్టుకొని ప్రచార ప్రకటనలకు భారీగా వ్యయం చేసి,తమ బ్రాండ్ మందులను అత్యధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. దీని కోసం పలు సంస్థలు వాటిని ఎక్కువగా విక్రయించడానికి మెడికల్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకొని వారితో వైద్యుల వద్ద విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. తమ మందులు విక్రయింపచేస్తే కొంత శాతం నగదు నజరానా ఇస్తామని, విదేశీ పర్యటనలు ఉంటాయని లేదా విలువైన వస్తువులు అందచేస్తామని, స్కీంలు ఎరచూపి వైద్యులతో తమ సంస్థ మందులు విక్రయమయ్యేలా చేస్తున్నారు. వీటికి కొందరు వైద్యులు ఆకర్షితులై వాటినే ప్రోత్సహిస్తు న్నారు. కమిషన్‌తో పాటు,బహుమతుల రూపంలో భారీగా లాభం చేకూరు తుండటంతో వైద్యులు సైతం వాటి వినియోగానికే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రాణాలతో చెలగాటం ఎందుకని భయపడి వైద్యులు ఏవి సూచిస్తే వాటినే రోగులు విధిలేక వాడుతున్నారు. మరోవైపు నర్సింగ్ ¬ంలు, ఆసుపత్రులు నిర్వహించే వైద్యులందరికి దాదాపుగా వారి సొంత దుకాణాలే ఉన్నాయి. జెనరిక్ ఔషధాల విక్రయం వల్ల తక్కువ లాభం వస్తుందని.. వాటిని ప్రోత్సహించటానికి ఆసక్తి చూపడం లేదు. పెద్ద ఔషధ కంపనీలు భారీగా ప్రకటనలతో పాటు తమ ఉత్పాదనలను విక్రయించుకోవడానికి వైద్యులకు భారీగా నజరానాలు ప్రకటిస్తూ రోగులను ఆర్థికంగా దివాలా తీయిస్తున్నాయి. మార్కెట్‌లో లభించే మందులతో పోలిస్తే జెనరిక్ మందులపై 40 నుంచి 80 శాతం తక్కువ ధరకు లభిస్తాయి.సామాన్యులకు తక్కువ ధరకు మందులను అందించే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయడానికి ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఈ దుకాణాల్లో తక్కువ ధరకే దాదాపు 700 రకాలను అందుబాటులో ఉంచారు. బ్రాండెడ్ కంపెనీల మందులు, జెనరిక్ ఔషధ ధరల్లో భారీగా తేడా ఉంటుంది. జెనరిక్ ఔషధాల్లో వాడిన మూలకమే స్వదేశీ, విదేశీ కంపేనీల ఉత్పత్తిదారులు వాడుతారు. ఈ రెండింటిలోనూ మూలకం ఒక్కటే ఉంటుంది.. ధర మాత్రమే తేడా.



