కర్ణాటకలో కలకలం.. 

– గుట్టలకొద్దీ ఓటరు కార్డులు
– ఎన్నికల సజావుగా జరుగుతాయి
– స్పష్టం చేసిన ఎన్నికల అధికారులు
బెంగళూరు, మే9(జ‌నం సాక్షి) : మరో మూడు రోజుల్లో పోలింగ్‌ జరుగనున్న వేళ.. ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టలకొద్దీ ఓటర్‌ ఐడీ కార్డులు బయటపడిన వ్యవహారం కర్ణాటకలో కలకలానికి దారితీసింది. కొత్త ఓటర్ల ముసుగులో భారీ స్థాయిలో చీకటి వ్యవహారం నడుస్తున్నట్లు వెల్లడికావడంతో ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమయ్యారు. వేగుల సమాచంమేరకు ఉత్తర బెంగళూరులోని జాలహళ్లిలోగల ఎస్‌ఎల్వీ అపార్డ్‌మెంట్‌పై అధికారులు దాడిచేయగా.. వేలకొద్దీ ఓటర్‌ ఓటర్‌ ఐడీకార్డులు, అప్లికేషన్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, ఓ ప్రింటర్‌ లభ్యమయ్యాయి. అక్కడున్న సరంజామా చూసి అధికారులు సైతం షాకయ్యారు. సదరు ఐడీకార్డులన్నీ బెంగళూరు రూరల్‌ పరిధిలోని రాజరాజేశ్వరినగర్‌ (ఆర్‌ఆర్‌ నగర్‌) నియోజకవర్గానికి చెందిన ఓటర్లవిగా అధికారులు గుర్తించారు. ఇటీవల సవరించిన జాబితాలో.. ఈ నియోజకవర్గంలో కొత్తగా 10.3శాతం ఓటర్లు చేరారు. దీంతో మొత్తం వ్యవహారంలో కుట్ర జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 24గంటల్లోగా విచారణపూర్తిచేసి అన్ని వివరాలను వెల్లడిస్తామని ఎన్నికల ప్రధాన అధికారి సంజీవ్‌ కుమార్‌ విూడియాకు చెప్పారు.
ఎన్నికను నిలిపేయాలి..
అపార్ట్‌మెంట్‌లో ఓటర్‌ కార్డు గుట్టల వ్యవహారంలో రాజకీయ ఆరోపణలు-ప్రత్యారోపణలు మిన్నంటుతున్నాయి. కుట్రలో సూత్రధారులు, పాత్రధారులు అంతా కాంగ్రెస్‌ పార్టీకి చెందినవాళ్లేనని బీజేపీ ఆరోపిస్తున్నది. కేంద్ర మంత్రి అనంతకుమార్‌ మరో అడుగుముందుకేసి ఆర్‌ఆర్‌ నగర్‌ నియోజకవర్గంలో ఎన్నికను నిలిపేయాలని ఈసీని డిమాండ్‌ చేశారు. మరో కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మాట్లాడుతూ..
ఆర్‌ఆర్‌ నగర్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా, ఓటర్‌ ఐడీకార్డుల వ్యవహారంలో తమ నేతల ప్రమేయం లేదని కాంగ్రెస్‌ వివరించింది. ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకమని, ఎన్నికల్లో ఓటమి భయం వల్లే చీప్‌ పాలిటిక్స్‌ ప్లే చేస్తున్నదని కాంగ్రెస్‌ నేతలు ఎదురుదాడిచేశారు.
నకిలీకార్డులు దొరికినచోట ఎన్నికల రద్దు లేదు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో బెంగళూరులో నకిలీఓటర్‌ కార్డులు లభ్యంకావడం కలకలం రేపింది. బెంగళూరులోని ఓ ప్లాంట్‌లో దాదాపు పదివేల నకిలీ ఓటర్‌ కార్డులు గుర్తించారు. దీనిపై ఎన్నికల సంఘం దర్యాప్తునకు ఆదేశించింది. అయితే నకిలీ ఓటర్‌ కార్డుల కారణంగా బెంగళూరు నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అంతరాయం ఉండదని, ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
————————————-