కర్ణాటకలో ప్రశాంతంగా పోలింగ్‌ 

– భారీగా ఓటుహక్కును వినియోగించుకున్న ఓటర్లు 
– పలు కేంద్రాల్లో మొరాయించిన ఏవీఎంలు
– ఓటర్లకు డబ్బులు పంచుతున్న జేడీఎస్‌ నాయకుడు అరెస్టు
– ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు
– 17న ప్రమాణస్వీకారం చేసేది నేనే
– బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప
బెంగళూరు,మే12(జ‌నం సాక్షి) : కర్ణాటకలో శనివారం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల్లో భారీసంఖ్యలో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం 222 నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికలకు పోలింగ్‌ జరిగింది. బీజేపీ అభ్యర్థి విజయకుమార్‌ మృతితో జయనగర్‌ అసెంబ్లీస్థానంలో ఎన్నిక వాయిదా పడింది. అదేవిధంగా బెంగళూరు రాజరాజేశ్వరినగర్‌లో పోలింగ్‌ మే 28కి వాయిదా పడింది. నకిలీ ఓటింగ్‌ కార్డులు భారీగా బయటపడటంతో ఇక్కడ పోలింగ్‌ వాయిదా పడింది. దీంతో మొత్తం 224 నియోజకవర్గాలకు గాను 222 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 2,600 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా.. రాష్ట్ర వ్యాప్తంగా 55,600 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. 3.50 లక్షల మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద రద్దీని తెలిపేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
17న సీఎంగా ప్రమాణం చేస్తా – యెడ్డీ
ఓ వైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుండగానే రాష్ట్ర సీఎంగా తాను మే 17న ప్రమాణ స్వీకారం చేస్తానని బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్‌ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 15న తాను ఢిల్లీ వెళ్లి 17న జరిగే తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తానని చెప్పారు. షికారిపురలో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం యడ్యూరప్ప విలేకరులతో మాట్లాడారు. 224 మంది సభ్యులు కలిగిన కర్ణాటక అసెంబ్లీలో తమ పార్టీ 145 నుంచి 150 స్ధానాలు గెలుపొందుతుందని యడ్యూరప్ప అంచనా వేశారు.
తాను రాష్ట్రమంతా మూడుసార్లు చుట్టివచ్చానని, బీజేపీ ఘనవిజయం సాధిస్తుందనే పూర్తి విశ్వాసం తనకుందని ఆయన చెప్పుకొచ్చారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని పాలక కాంగ్రెస్‌ సర్కార్‌ పట్ల ప్రజలు విసిగివేసారారన్నారు. 2008లో బీజేపీ దక్షిణాదిలో తొలిసారిగా కర్ణాటకలో అధికార పగ్గాలు చేపట్టినప్పుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 2011లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన అధికార పీఠం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
శ్రీరాములు గోపూజ.. ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌..
గాలి జనార్ధన్‌రెడ్డి సన్నిహితుడు, బాదామి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బీ. శ్రీరాములు.. తన ఇంట్లో శనివారం ఉదయం గో పూజ చేశారు. ఓటింగ్‌కు వెళ్లే కంటే ముందు ఆయన ఈ పూజ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీరాములు కాషాయం రంగులో ఉన్న దుస్తులు ధరించి.. గోవుకు ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బాదామి నియోజకవర్గం నుంచి కర్ణాటక
సీఎం, కాంగ్రెస్‌ అభ్యర్థి సిద్ధరామయ్య పోటీలో ఉన్నారు. ఇదిలా ఉంటే శ్రీరాములు తీరుపై కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేసింది. ఇలా పోలింగ్‌ రోజు గోపూజ చేయడం ఓటర్లను ప్రభావితం చేసేందుకేనని, దీన్ని ఎన్నికల అక్రమంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఈసీని కోరింది. బాదామి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సీఎం సిద్ధరామయ్య బరిలో నిలిచిన విషయం విదితమే. మైనింగ్‌ కేసు మాఫీకి మాజీ జడ్జి అల్లుడితో శ్రీరాములు బేరసారాలు జరిపారని వచ్చిన వీడియోలపై కూడా కాంగ్రెస్‌ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలను ప్రసారం చేయవద్దని ఈసీ ఆదేశించింది. కాగా శ్రీరాములు వీడియోలు నకిలీవని బీజేపీ అధినేత అమిత్‌ షా కొట్టిపారేశారు. మొత్తంవిూద బీజేపీ అభ్యర్థి శ్రీరాములు వ్యవహారంపై కాంగ్రెస్‌ ఫిర్యాదుల వర్షం కురిపిస్తోంది.
వరుణలో కాంగ్రెస్‌పైనే ఓటర్ల కరుణ..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన వరుణ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్‌ యతీంద్ర పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గత ఏడాదిన్నరగా అన్ని గ్రామాల్లో తాను పర్యటించానని కాంగ్రెస్‌ సర్కార్‌ పనితీరు పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌లో దేవాలయాల సందర్శనపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. కర్ణాటకలో పోలింగ్‌ జరుగుతున్న క్రమంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందునే ఓటర్లను ఆకట్టుకునేందుకు మోదీ నేపాల్‌లో దేవాలయాల చుట్టూ తిరిగారని కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఆలయాల సందర్శనకు మోదీ ఈ రోజే ఎందుకు ఎంచుకున్నారని ఆయన ప్రశ్నించారు.
ఓటేసిన కుమారస్వామి దంపతులు…
రామ్‌నగరాలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామి, ఆయన భార్య అనిత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని కుమారస్వామి పేర్కొన్నారు. జేడీఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు ఏకమయ్యారని, తమ గెలుపును ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా బెంగళూరులో మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే తన కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఓటు వేసేందుకు క్యూ లైన్‌లో నిల్చున్న ఫొటోను కుంబ్లే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఇక మరో క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. కన్నడ నటులు రమేశ్‌ అరవింద్‌, రవిచంద్ర, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ కూడా ఓటు వేశారు.
ఓటు వేయండి.. ఉచితంగా దోశ తినండి..
కర్ణాటక విధానసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. అవగాహన కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించింది. అయితే ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఓ ¬టల్‌ నిర్వహకుడు వినూత్న పద్ధతిలో ముందుకు వచ్చాడు. గ్రాండ్‌ ¬టల్‌ యజమాని కృష్ణ రాజ్‌ బెంగళూరులో ఓటింగ్‌ శాతం పెంచడానికి తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ రోజు మొదటి సారిగా ఓటుహక్కు వినియోగించుకున్న యువతకు తన ¬టల్‌లో ఉచితంగా దోశ అందిస్తున్నాడు. అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న ఇతరులకు ఫిల్టర్‌ కాఫీని ఇస్తానని చెబుతున్నాడు. అయితే ఉచిత దోశ, కాఫీని పొందాలంటే ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును ¬టల్‌లో చూపించాల్సి ఉంటుంది. బెంగళూరులో
నమోదవుతున్న తక్కువ ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికే తాను ఇలా వినూత్నంగా ముందుకు వచ్చినట్లు రాజ్‌ తెలిపారు. ‘విూరు ఎవరికైనా ఓటు వేయండి.. కానీ ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి. మా ¬టల్‌లో ఉచిత దోశ, కాఫీ పొందండి.’ అని ¬టల్‌ నిర్వాహకుడు పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే గాంధీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా జేడీఎస్‌ నాయకుడు, మాజీ కార్పొరేటర్‌ మల్లేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, శ్రీరాంనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
కర్ణాటకలో తొలిసారిగా పింక్‌పోలింగ్‌ కేంద్రాలు…
కర్ణాటకలో పింక్‌ పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. మహిళా సిబ్బందితో నడిచే పింక్‌ పోలింగ్‌ కేంద్రాలను తొలిసారి ఈసీ ప్రయోగాత్మకంగా చేపట్టింది. ప్రిసైడింగ్‌ ఆఫీసర్స్‌, పోలింగ్‌ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు, భద్రతా సిబ్బంది మొత్తం మహిళలే ఉండడం గమనార్హం. మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటుహక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు వీటిని ఏర్పాటుచేసినట్లు ఈసీ వెల్లడించింది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 450 పింక్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. రాజకీయ పార్టీలు కూడా పోలింగ్‌ కేంద్రాల్లో మహిళా ఏజెంట్లనే నియమించడం విశేషం.