కర్ణాటకలో మూడు నియోజకవర్గాలు కీలకం

బెంగళూరు, మే16(జ‌నం సాక్షి) : వివిధ కారణాలతో వాయిదాపడ్డ మూడు నియోజకవర్గాలు ప్రస్తుతం కీలకం అవుతున్నాయి. జయనగర నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి విజయకుమార్‌ అకస్మిక మృతితో ఎన్నిక వాయిదా పడింది. బెంగళూరులోని రాజరాజేశ్వరీనగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరత్నకు సంబంధించిన అపార్ట్‌మెంట్‌లో 9వేలకుపైగా ఓటరు గుర్తింపు కార్డులు పట్టుబడిన మేరకు ఎన్నికల కమిషన్‌ వాయిదా వేసింది. ఇక జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి రెండు నియోజకవర్గాలు చెన్నపట్టణ, రామనగర్‌లలోనూ గెలుపొందారు. దీంతో ఒక స్థానానికి రాజీనామా చేయక తప్పదు. ఇలా మూడు నియోజకవర్గాలలో ఎన్నికలు అనివార్యమవుతున్నాయి. ఇలా మూడునియోజకవర్గాలు కీలకం కానున్నాయి. మారిన సవిూకరణల నేపథ్యంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ఒక్కటయ్యాయి. జయనగర కాంగ్రెస్‌ అభ్యర్థిగా సౌమ్యరెడ్డి పేరు ఖరారైంది. ఈ స్థానం నుంచి జేడీఎస్‌ తప్పుకుని ఆమెకు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక రాజరాజేశ్వరీనగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరత్నపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనను తప్పించి జేడీఎస్‌ అభ్యర్థికి రెండు పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక కుమారస్వామి ఏ స్థానం వదులుకున్నా అక్కడనుంచి ఆయన భార్య అనితా బరిలోకి దిగే అవకాశం ఉంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు మద్దతు ఇస్తాయి. ఇలా జేడీఎస్‌కు రెండు స్థానాలు పెరిగే అవకాశం కలసి వస్తుంది.