కర్ణాటక కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌ 

మంత్రి డి.కె. శివకుమార్‌ఫై మరో కేసు నమోదు
బెంగళూరు, జూన్‌21(జ‌నం సాక్షి) : కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, జలవనరుల మంత్రి డీ కే శివ కుమార్‌పై ఆదాయపు పన్ను శాఖ మరో కేసు దాఖలు చేసింది. ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపించింది. 2017 ఆగస్టు నుంచి ఆయన సంస్థల్లో నిర్వహించిన సోదాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఆయనపై నాలుగు కేసులను దాఖలు చేసింది. గతంలో దాఖలు చేసిన మూడు కేసుల్లో ఆయన బెయిలు పొందారు. శివ కుమార్‌ ఉద్దేశపూర్వకంగా ఆదాయపు పన్నును ఎగ్గొట్టారని ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది. ఈ కేసును బెంగళూరులోని ప్రత్యేక ఆర్థిక నేరాల విభాగం న్యాయస్థానం విచారణ జరుపుతుంది. న్యూఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ రోడ్డులోని శివ కుమార్‌ స్వంత అపార్ట్‌మెంట్‌ నుంచి స్వాధీనం చేసుకున్న రూ.4.03 లక్షలుకు సంబంధించి నాలుగో కేసు దాఖలైంది. ఈ సొమ్ము వ్యవసాయ ఆదాయమని శివకుమార్‌ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు శివ కుమార్‌ లెక్కల్లో చూపని సొమ్మును ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ ఖాతాకు బదిలీ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ ఆరోపించినట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రిపై అవినీతి కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక కాంగ్రెస్‌ ఇరకాటంలో పడింది.