కర్నాటకలో బంగ్లాల పంచాయితీ

కోరిన బంగ్లా ఇవ్వలేదని అలిగిన యెడ్డీ

బెంగళూరు,జూలై2(జ‌నం సాక్షి): కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలో ఉండేందుకు నిరాకరించారు. తాను కోరిన బంగ్లాను ప్రభుత్వం ఇవ్వలేదని, ఈ బంగ్లా తనకు వద్దని చెప్పారు. కర్ణాటకలో ఇటీవల జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. జేడీఎస్‌ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రుల పంపకాల అనంతరం ప్రభుత్వ బంగ్లాల కేటాయింపులు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న భాజపానాయకుడు యడ్యూరప్పకు రేస్‌కోర్స్‌ రోడ్‌లో ఉన్న బంగ్లా నంబర్‌ 4ను కుమారస్వామి ప్రభుత్వం కేటాయించింది. అయితే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బంగ్లా నంబర్‌ 2లో ఉండేవారు. ఇప్పుడు కూడా అదే బంగ్లాను ఇవ్వాలని ఆయన కోరినప్పటికీ ప్రభుత్వం బంగ్లా నంబర్‌ 4ను కేటాయించింది.ప్రభుత్వ నిర్ణయం పట్ల యడ్యూరప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నా వినతిని సీఎం పట్టించుకోలేదు. అందుకే ఈ బంగ్లా నాకు వద్దు. నేను నా సొంత ఇంట్లోనే ఉంటాను’ అని యడ్యూరప్ప అన్నారు. 2011 వరకు యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో బంగ్లా నంబర్‌ 2లోనే ఉన్నారు. ఆ సమయంలో తాను బంగ్లాకు వాస్తు పరంగా ఎన్నో మార్పులు చేయించానని యడ్యూరప్ప చెప్పుకొచ్చారు. ఆ బంగ్లా వల్లే ఆయన రెండుసార్లు సీఎం అయ్యారని, అది ఆయనకు ‘లక్కీ’ భవనం అని యడ్యూరప్ప వర్గాలు చెప్పుకొంటున్నాయి. మరోవైపు వాస్తు కారణంగానే యడ్యూరప్పకు బంగ్లా నంబర్‌ 2ను ఇవ్వలేదని ఆయన వర్గాలు చెబుతున్నాయి. మాజీ ప్రధాని, సీఎం కుమారస్వామి తండ్రి దేవేగౌడ వాస్తును చాలా నమ్ముతారని, ఒకవేళ యడ్యూరప్పకు బంగ్లా నంబర్‌ 2 కేటాయిస్తే మళ్లీ సీఎం అవుతారేమోనన్న భయంతోనే ఆ భవనాన్ని ఇవ్వలేదని పేర్కొంటున్నాయి. యడ్యూరప్ప ఖాళీ చేసిన తర్వాత గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అప్పటి పర్యావరణ శాఖ మంత్రి బి. రామ్‌నాథ్‌ రాయ్‌ ఆ బంగ్లాలో ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో దాన్ని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి మహేశ్‌కు కేటాయించారు.