కర్నాటకలో మారుతున్న సవిూకరణాలు

గవర్నర్‌తో బిజెపి సిఎం అభ్యర్థి యెడ్యూరప్ప భేటీ
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వినతి
రెండ్రోజుల్లో చెబుతానన్న గవర్నర్‌ వాజూభాయ్‌
బెంగళూరు,మే15(జ‌నం సాక్షి ):  కర్ణాటక రాజకీయం రాజ్‌భవన్‌లో కీలకమలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటులో ఆ రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా నిర్ణయం కీలకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ(104) తరఫున యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంతకుమార్‌ గవర్నర్‌ను కలిశారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని యడ్యూరప్ప గవర్నర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి 7 రోజుల గడువు ఇచ్చారు. వారంలోగా కర్ణాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. బలనిరూపణకు యడ్యూరప్ప వారం రోజుల గడువు కోరగా.. రెండు రోజుల్లో తన నిర్ణయం తెలియజేస్తానని గవర్నర్‌ తెలిపారు. ఈ దశలో
అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి యడ్యూరప్ప ప్రయత్నాలు మొదలెట్టారు. కింగ్‌మేకర్‌గా మారిన జేడీ(ఎస్‌)ను బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. దేవెగౌడ పెద్దకొడుకు రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. రేవణ్ణ వర్గానికి 12 మంది జేడీ(ఎస్‌) ఎమ్మెల్యేల మద్దతు ఉంది. చీలికను అడ్డుకునేందుకు కుమారస్వామి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలావుంటే కర్ణాటకలో ప్రజలు ఛీకొట్టినా కాంగ్రెస్‌ మాత్రం అధికారం కోసం అడ్డదారిలో వెళ్తున్నదని బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప విమర్శించారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ను దూరం పెట్టి, బీజేపీని దగ్గరకు తీసుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ముక్త్‌ కర్ణాటక దిశగా కన్నడ ఓటర్లు తీర్పు చెప్పారని యడ్యూరప్ప చెప్పారు. కన్నడ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ప్రయత్నించడాన్ని ప్రజలు సహించబోరని యడ్యూరప్ప స్పష్టంచేశారు. అధిష్టానం పెద్దలతో మాట్లాడిన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.