కర్నాటకలో మొత్తం ఫలితాలు వెల్లడి

104 స్థానాలతో అతిపెద్ద పార్టీ బిజెపి
కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 38 స్థానాలు 
ఇద్దరు ఇండిపెండెట్ల విజయం
బెంగళూరు,మే15(జ‌నం సాక్షి ):  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి ఫలితాలు వెలువడ్డాయి.
ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఇక్కడ హంగ్‌ అసెంబ్లీ ఏర్పడింది. దీంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. అయితే 104 స్థానాలతో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది.  భాజపాకు 104 స్థానాలు, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 38 స్థానాలు దక్కగా, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. ఈ నెల 12న ఎన్నికలు జరగగా 15న కౌంటింగ్‌ జరిగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌లో పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి. భాజపా అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోకపోవడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. కాగా మరో రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. అసలు మూడు ప్రముఖ పార్టీలు ¬రా¬రీగా తలపడ్డ ఎన్నికల బరిలో విజయ దుందుభి మోగించిన ఆ ఇద్దరు ఎవరన్న ఆసక్తీ సర్వత్రా నెలకొంది. ముల్‌బాగల్‌ నియోజవర్గం నుంచి స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేసిన హెచ్‌ నగేష్‌ విజయం సాధించారు. ఆయన జేడీఎస్‌పై గెలిచారు. కాగా తాను కాంగ్రెస్‌ వ్యక్తినని, తాను కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నానని నగేష్‌ ప్రకటించారు. ఈ స్థానంలో గతంలో కాంగ్రెస్‌ గెలుపొందింది. మరో నియోజకవర్గం రణెబెన్నూర్‌ నుంచి కేపీజేపీ పార్టీ అభ్యర్థి ఆర్‌ శంకర్‌ విజయం సాధించారు. ఈయన కూడా కాంగ్రెస్‌కే మద్దతిస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో ఆర్‌ శంకర్‌పైన కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందగా ఇప్పుడు శంకర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కృష్ణప్ప భీమప్పపై గెలిచారు.