కర్నాటకలో రాజకీయ ఎత్తులు

రంగంలోకి దిగిన బిజెపి నేతలు
జెడిఎస్‌లో రేవణ్ణకు గాలం
శివకుమార్‌ అసంతృప్తిపై ఆరా
ఢిల్లీ టూర రద్దు చేసుకున్న యెడ్యూరప్ప
క్యాంప్‌ రాజకీయాలపై కాంగ్రెస్‌,జెడిఎస్‌ ఆలోచన?
బెంగళూరు,మే15(జ‌నం సాక్షి ):  కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్న వేళ కాంగ్రెస్‌,జెడిఎస్‌ల కూటమికి చెక్‌ పెట్టేందుకు బిజెపి రంగంలోకి దిగింది. ఢిల్లీ టూర్‌ క్యాన్సిల్‌ చేసుకున్న యెడ్యూరప్ప అక్కడే మకాం వేసి తాజా పరిస్థితులను అంచనా వేస్తున్నారు. మరోవైపు జెడిఎస్‌, కాంగ్రెస్‌లను కూడా చీల్చేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. అసంతృప్త నేతలను దగ్గరికి చేరదీసి వారివెంట ఉన్నావారితో కూటమి కట్టించి బిజెపి అధికార పగ్గాలు చేపట్టాలని చూస్తోంది. కాంగ్రెస్‌లో డికె శివకుమార్‌, జెడిలో రేవణ్ణలకు బిజెపి గాలం వేస్తోంది. మరోవైపు ఫలితాలు రాగానే క్యాంపు నిర్వహించి ఎమ్మెల్యేలను తరలించేందుక కాంగ్రెస్‌ ,జెడిఎస్‌లు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. బిజెపి కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టేందుకు ఎత్తులు వేస్తున్నాయి.  హంగ్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌కు అధికారం దక్కకుండా బీజేపీ, బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ మొత్తం పొలిటికల్‌ గేమ్‌లో జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌గా మారింది. జేడీఎస్‌ గెలిచిన స్థానాలు కాంగ్రెస్‌, బీజేపీతో పోల్చుకుంటే తక్కువే. కానీ నిర్ణయాత్మక శక్తిగా మారడంతో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఈ రెండు పార్టీలు జేడీఎస్‌ను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌ ఇప్పటికే సీఎం పదవిని కూడా జేడీఎస్‌కు ఆఫర్‌ చేసింది. ఈ ఆఫర్‌కు కుమారస్వామి కూడా ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో జేడీఎస్‌ను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్‌ కుమారస్వామికి సీఎం పదవి ఆఫర్‌ చేస్తే.. బీజేపీ మాత్రం దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్‌ చేసింది. రేవణ్ణకు
12మంది జేడీఎస్‌ ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఆయన అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఎమ్మెల్యేలు కూడా దేవెగౌడ, కుమారస్వామి, రేవణ్ణ వర్గాలుగా చీలిపోయినట్లు సమాచారం. అయితే పార్టీలో ఏర్పడిన ఈ చీలికను అడ్డుకునేందుకు కుమారస్వామి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇకపోతే  కాంగ్రెస్‌ పరిస్థితి పూర్తి అయోమయంగా ఉంది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్‌కు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ ముందుకు రావడంతో ఉప ముఖ్యమంత్రి పదవి కోసం అంతర్గత పోరు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ ఊహాగానాలకు ఊతమిచ్చేలా ప్రస్తుత సిద్ధరామయ్య మంత్రివర్గంలోని కీలక మంత్రి డీ కే శివ కుమార్‌ మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు రాజ్‌ భవన్‌కు వెళ్ళారు. తనతోపాటు ఓ స్వతంత్ర ఎమ్మెల్యేను కూడా తీసుకెళ్ళారు. కానీ ఆయనకు గవర్నర్‌ విజుభాయ్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారని, అందుకే తన బలాన్ని నిరూపించుకునేందుకే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సంబంధం లేకుండా గవర్నర్‌ను కలిసేందుకు ప్రయత్నించారని కొందరు అంటున్నారు. ఆయనను పక్కకు తప్పించాలని కూడా బిజెపి ఎత్తులు వేస్తోందని సమాచారం. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ విశ్వ ప్రయత్నం చేశారని కర్ణాటక మంత్రి డీకే శివ్‌కుమార్‌ అన్నారు. రాహుల్‌ తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నేతలమైన తాము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని, ఓటమి అదే కారణమని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ చేతులు కలిపాయి. కాంగ్రెస్‌ రంగంలోకి దిగడంతో రాజకీయ సవిూకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. జేడీఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. జేడీఎస్‌ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో ఇరు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరగా, గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ తిరస్కరించడంతో కన్నడ రాజకీయం మరోమారు రసకందాయంలో పడింది. అయితే కాంగ్రెస్‌ ఓపెన్‌ ఆఫర్‌ను శివకుమార్‌ లాంటి వారు వ్యతిరేకిస్తున్నారని సమాచారం.