కలామే మా అభ్యర్థి : మమత
న్యూఢిల్లీ, జూన్ 15 : రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిగా ఎపిజె అబ్దుల్ కలామ్‌ను నిలబెట్టాలన్న తమ సంయుక్త అభ్యర్థనపై సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ పునరాలోచనలో పడినట్లుగా వస్తున్న వార్తలను తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఏమాత్రం లక్ష్యపెట్టడం లేదు. మాజీ రాష్ట్రపతి కలామ్ తమ రాష్ట్రపతి అభ్యర్థి అని మమతా బెనర్జీ శుక్రవారం న్యూఢిల్లీలో విలేకరులతో చెప్పారు. ‘అది తప్పుడు సమాచారం. ఇది మాత్రమే చెప్పగలను. ఆయన (కలామ్) రాష్ట్రపతి ఎన్నికలలో మా (టిఎంసి-ఎస్‌పి) అభ్యర్థి. స్వాతిశయం లేదు. తగాదా లేదు. కొట్లాట లేదు’ అని ఆమె పేర్కొన్నారు. కలామ్‌కుమద్దతు ఇచ్చే ఆసక్తి ఎస్‌పికి ఇక ఎంత మాత్రం లేదని వస్తున్న వార్తలను తోసిపుచ్చుతూ మమత విలేకరుల వద్ద పైవిధంగా వ్యాఖ్యానించారు. ఎస్‌పి, టిఎంసి రాష్ట్రపతి ఎన్నికలకు తమ అభ్యర్థులుగా కలామ్, ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ పేర్లను మంగళవారం ప్రతిపాదించిన విషయం విదితమే. కలామ్ తమ అభ్యర్థి అని మమత గురువారం ప్రకటించారు. కలామ్ విషయమై ఎస్‌పి పునరాలోచన చేస్తున్నట్లు శుక్రవారం మీడియా వార్తలు సూచిస్తున్నాయి. కలామ్ విషయమై మమత గురువారం ఉపయోగించిన ‘హమారా క్యాండిడేట్’ పదాలకు ‘మా’, ‘నా’ అని అర్థం కూడా ఉన్నట్లు ఎస్‌పి నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం ఈ మీడియా వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నది. రామ్‌గోపాల్ యాదవ్ వ్యాఖ్యల గురించిన ప్రశ్నలకు మమత సమాధానం ఇస్తూ, ‘కాంగ్రెస్ పదాలను ఆయనకు ఆపాదించకండి. విభజించి, పాలించవద్దు. ‘హమారా’ అంటే ‘దోనో కా క్యాండిడేట్’ (రెండింటి అభ్యర్థి) అని అర్థం. నా హిందీ బాగుండకపోవచ్చు. ఈ గందరగోళానికి అదే కారణం కావచ్చు’ అని అన్నారు. న్యూఢిల్లీలో ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) సమావేశానికి హాజరు కాకుండానే కోలకతాకు బయలుదేరి వెళ్లే ముందు విలేకరులతో మాట్లాడిన మమత తమ సంయుక్త ప్రతిపాదన నుంచి ములాయం సింగ్ యాదవ్ వెనుకకు మళ్లారని అనడం తప్పు అని అన్నారు. కాగా, మమత విలేకరుల గోష్ఠి అనంతరం పశ్చిమ బెంగాల్ ఎస్‌పి నాయకుడు కిరణ్మయ్ నందా విలేకరులతో మాట్లాడుతూ, ‘ములాయంజీ, మమతాజీ తీసుకున్న నిర్ణయానికి మేము నిబద్ధులమై ఉంటాం’ అని స్పష్టం చేయడం గమనార్హం.