కాంగ్రెస్‌ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం

` మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
ఖమ్మం,జనవరి9(జనంసాక్షి):పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులను దీవించినట్లే.. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆశీర్వదించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కోరారు. పంచాయితీలు, పురపాలికలు బలపడాలంటే అధికార పార్టీ అభ్యర్థులు ఉండాలన్నారు. ఇల్లందు పట్టణంలో నూతన రహదారులు, కాలువల నిర్మాణాలకు శుక్రవారం మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గంలోని నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో పర్యటించి, జీవో 76కు సంబంధించిన క్రమబద్ధీకరణ సమస్యలను పరిష్కరిస్తానని హావిూ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్‌, ఎమ్మెల్యే కోరం కనకయ్య, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ బానోత్‌ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.