త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం

` నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దు
` రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు
` నిరుద్యోగుల పట్ల ‘బీఆర్‌ఎస్‌’ది కపట ప్రేమే..
` మీ మొసలి కన్నీరు చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది
` అప్పుడు ‘అశోక్‌ నగర్‌ సెంట్రల్‌ లైబ్రరీ’ గుర్తుకు రాలేదా..? : మంత్రి శ్రీధర్‌ బాబు
హైదరాబాద్‌(జనంసాక్షి):జాబ్‌ క్యాలెండర్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని.. త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని తెలిపారు. శుక్రవారం ఐఐటీ హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్‌ బాబు ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడారు.తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై రాజకీయం చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులపై మంత్రి శ్రీధర్‌ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి వ్యవస్థలను నిర్వీర్యం చేసి, నిరుద్యోగుల జీవితాలను అంధకారం చేసిన వారు నేడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నిరుద్యోగులు పడిన అష్టకష్టాలను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘అశోక్‌ నగర్‌ సెంట్రల్‌ లైబ్రరీ సాక్షిగా పదేళ్లు నిరుద్యోగులను వంచించిన చరిత్ర విూది కాదా? నాడు నోటిఫికేషన్ల పేరుతో ఊరించి, పరీక్షల పేరుతో వేధించి, నిరుద్యోగుల యవ్వనాన్ని రోడ్ల పాలు చేసింది విూరు కాదా?’’ అని ప్రశ్నించారు. టీజీపీఎస్సీ క్వశ్చన్‌ పేపర్లను బజారులో పప్పుబెల్లాల్లా అమ్ముకుంటుంటే కళ్లు అప్పగించి చూసిన పాపం బీఆర్‌ఎస్‌ నేతలదేనని ఆయన మండిపడ్డారు. పేపర్‌ లీకేజీల వల్ల లక్షలాది మంది నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని, గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థత గత ప్రభుత్వానిదని విమర్శించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ భర్తీని ఒక ‘పవిత్ర కార్యం’లా చేపట్టిందని శ్రీధర్‌ బాబు తెలిపారు. ‘‘మేము అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎక్కడా ఎలాంటి లీకేజీలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఇప్పటికే 70 వేల మందికి ప్రభుత్వోద్యోగాలు కల్పించాం. గ్రూప్‌`1, గ్రూప్‌`2, గ్రూప్‌`4 అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చాం. త్వరలోనే గ్రూప్‌`3 నియామక పత్రాలు కూడా అందజేస్తాం’’ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిలో అత్యధికులు బడుగు, బలహీన వర్గాల వారే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తాను శాసనమండలిలో అన్న మాటలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నిరుద్యోగులను తక్కువ చేయాలన్నది నా ఉద్దేశ్యం కాదు. తెలంగాణ భవిష్యత్తు విూరే (యువత). కేవలం రాజకీయ లబ్ధి కోసం కొందరు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. వారి ఊబిలో చిక్కి మోసపోకండి’’ అని నిరుద్యోగ సోదరులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 25 లక్షల మంది నిరుద్యోగుల కోసం ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోందని మంత్రి వివరించారు. శాస్త్రీయబద్ధమైన ‘జాబ్‌ క్యాలెండర్‌’ ద్వారా నియామకాలు చేపడతాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు స్కిల్లింగ్‌, అప్‌ స్కిల్లింగ్‌, రీ స్కిల్లింగ్‌పై దృష్టి సారించి ప్రైవేట్‌ రంగంలోనూ ఉపాధి కల్పిస్తాం. రాజకీయ నిరుద్యోగుల మాటలు నమ్మవద్దని, విూ కష్టం విలువ తెలిసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విూకు ఎప్పుడూ అండగా ఉంటుందని, విూ భవిష్యత్తుకు తమదే భరోసా అని మంత్రి శ్రీధర్‌ బాబు పునరుద్ఘాటించారు.