కల్వల గ్రామంలో అంతుచిక్కని కాళ్ళవాపు
చికిత్స చేయిస్తున్నా తగ్గని వ్యాధి
ఆందోళనలో గ్రామ ప్రజలు
మహబూబాబాద్,జూల30(జనం సాక్షి): కేసముద్రం మండలం కల్వల గ్రామంలో కాళ్ళ వాపు వ్యాధి కలకలం రేపుతోంది. అకస్మాత్తుగా కాళ్లలో వాపు వచ్చి విపరీతమైన మంట నొప్పి ఉంటుంది. దీంతో బాధితులు నొప్పికి తాళలేక ఆస్పత్రులకు వెళ్తే, వాపు ప్రాంతాన్ని ఆపరేషన్ ద్వారా తొలగిస్తున్నారు. ఇలా గ్రామంలో రెండు నెలల క్రితం ఆరుగురు భాదితులు ఉండగా, వీరి సంఖ్య రోజురోజుకు పెరిగి 16 మందికి చేరింది. దీంతో వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లవలసి రావడం, లక్షల రూపాయలు ఖర్చు అవుతుండడం ఆ కుటుంబాలకు భారంగా మారగా, ఆ వ్యాధి ఎవరుకి వస్తుందోనని ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళలనలకు గురవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలో సుమారు 4వేలకు పైగా జనాభా ఉంది. మొదట చలిజ్వరంతో, ఆ తర్వాత ఎడమ కాలు వాపు, నలుపు రంగులోకి మారి మంచం పడుతున్నారు. వ్యాధి బారినపడిన వారు మొదట గ్రామంలోని ఆర్‌ఎంపీలను సంప్రదించి చికిత్స పొందుతున్నారు. వ్యాధి తగ్గకపోవడంతో మహబూబాబాద్, వరంగల్,హైదరాబాద్ లలోని హాస్పిటల్‌లకు వెళ్తున్నారు. అక్కడ డాక్టర్లు ఇన్ఫెక్షన్ సోకిన ప్రదేశాలలో ఆపరేషన్ చేసి ఇన్ఫెక్షన్ను తీసి వేస్తున్నారు. సంవత్సర కాలం గడిచినా ఆపరేషన్ చేసిన ప్రదేశంలో పుండు మానక పోవడం, ఆ వ్యాదిగ్రస్తులు మంచానికె పరిమితం అవుతున్నారు. గ్రామానికి చెందిన మల్లేశం సంవత్సరం క్రితం చలిజ్వరంతో కాలువాపు రాగా మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందాడు.. జబ్బు నయమైన కొన్ని రోజులకే మళ్లీ కాలు వాపు మొదలైందని బాదితుడు వాపోతున్నాడు ఇదే గ్రామానికి చెందిన నీలం శ్రీకాంత్ కు 9 నెలల క్రితం జ్వరంతో కాలు వాపు వచ్చింది. ఇతను మొదట
మహబూబాబాద్, అనంతరం వరంగల్ ఓఉఓ కు వెళ్ళాడు. అక్కడ తగ్గకపోవడంతో హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రి కి వెళ్ళాడు. అక్కడ డాక్టర్లు ఆపరేషన్ చేసారు. 9 నెలలు గడిచినా ఇతనికి ఆ వ్యాధి తగ్గక మంచానికే పరిమితమైనాడు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి మల్లయ్య కూడా ఇదే వ్యాధితో 8 నెలల నుండి బాధపడుతున్నాడు. మరో మహిళ మాచర్ల సత్యమ్మ కు 7 నెలల క్రితం తీవ్ర చలి జ్వరం, కాలు వాపు రావడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందింది. ఇప్పటికీ పూర్తిగా నయం కాక, నొప్పులతో ఇబ్బంది పడుతుంది. వారం రోజుల క్రితం గ్రామానికి చెందిన సోమయ్య అనే వృద్దుడు మంచం పట్టిన వారంతా కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు మంచం పట్టడం తో వీరికి వైద్యం ఖర్చు తో పాటు,వీరి పై ఆధారపడిన కుటుంబ సబ్యుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఇప్పటి వరకు 16 మందికి ఈ వ్యాధి సోకడంతో, వీరిని చూడటానికి బంధువులు కూడా రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వెలిబుచ్చారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందోనని గ్రామస్తులు భయాందోళన లకు గురవుతున్నారు. గ్రామంలో అందరూ భయాందోళనలకు గురవుతుంటే నేటి వరకు ఈ గ్రామాన్ని అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు పట్టించుకోక పోవడం విచారకరం. ఇప్పటికైనా అధికారులు స్పంధించి గ్రామాన్ని సందర్శించి,ఈ వ్యాది త్రాగు నీటి ద్వారా వస్తుందా… దోమల ద్వారా వస్తుందా దేని ద్వారా వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్థులు కోరుతున్నారు .