కవాతు చేస్తే దేశద్రోహం కేసులా ?
తీవ్ర ఆందోళన : దేవీప్రసాద్
హైదరాబాద్, అక్టోబర్ 8 (జనంసాక్షి)
తెలంగాణ కవాతు సందర్భంగా ఉద్యోగులపై నమోదైన కేసులకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని పోలీసు డైరెక్టర్ జనరల్ వి. దినేష్‌రెడ్డి అనడం ఆశ్చర్యంగా ఉందని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ సూచన మేరకు ఉద్యోగులపై నమోదైన కేసుల వివరాలను త్వరలోనే నివేదించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే 21 కేసులకు సంబంధించి సికింద్రాబాద్, నాంపల్లి కోర్టులకు పోలీసులు ఎఫ్ఐఆర్లను అందచే శారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు
ఈ రోజు మధ్యాహ్నం కేసుల ఎత్తివేత డిమండ్పై మరో సారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. కేసుల ఎత్తివేత గురించి చర్చించారు. అనంతరం ఐకాస నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్ విూడియాతో మాట్లాడారు. ఉద్యోగులపై కేసుల ఎత్తివేత విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఉద్యోగులపై కేసుల అంశం తన దృష్టికి రాలేదని పోలీసు డైరెక్టర్ జనరల్ అన్నట్లు సీఎస్ పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందని దేవీప్రసాద్ అన్నారు.సీఎస్ సూచన మేరకు కేసుల సమగ్ర సమాచారం ఆమెకు అందించడం జరుగుతుందని తెలిపారు. కేసులను ఎత్తివేయని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఉద్యోగులు, విద్యార్ధులను కేసులతో బెదిరింపులకు పాల్పడి ఉద్యమానికి దూరం చేయాలనే కుట్ర పూరితమైన చర్యలను తీవ్రంగా ప్రతిఘటించి తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉదృతంగా ముందుకు తీసుకెళ్లగలమని చెప్పారు. పది రోజుల్లో కేసులు ఎత్తివేయాలని సీఎస్‌ను కోరడం జరిగిందని తెలిపారు. ఉద్యోగులపై పోలీసులు దేశద్రోహం లాంటి నేరాలు మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.